కరోనా వైరస్ మన జీవితాలపై పెను ప్రభావం చూపించిందని ప్రధాని మోదీ అన్నారు. మంగళవారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ఆయన ప్రకటించారు. అలాగే లాక్‌డౌన్ 3.0 మే 17వ తేదీ నుంచి ముగియనున్న నేపథ్యంలో ఆ విషయంపై కూడా మోదీ మాట్లాడారు.
దేశంలో మే 18వ తేదీ నుంచి లాక్‌డౌన్ 4.0 కొనసాగుతుందని మోదీ అన్నారు. అయితే ఎప్పటి వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తారనే విషయాన్ని మోదీ వెల్లడించలేదు. ఇక కరోనాతో మనం ఎక్కువ కాలం జీవించాల్సి రావచ్చని.. అందుకని ప్రజలందరూ స్వీయ రక్షణ పాటిస్తూ కరోనాను ఎదుర్కోవాలని మోదీ అన్నారు. ప్రజలు మాస్కులను ధరించాలని.. కరోనాపై మన పోరాటం కొనసాగుతుందని అన్నారు.
కాగా తొలి విడత లాక్‌డౌన్ మార్చి 25 నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు అమలవగా.. లాక్‌డౌన్ 2.0 ను ఏప్రిల్ 15 నుంచి మే 3 వరకు, మే 4 నుంచి మే 17వ తేదీ వరకు లాక్‌డౌన్ 3.0 ను అమలు చేస్తున్నారు. ఇక మే 18 నుంచి లాక్‌డౌన్ 4.0 అమలు కానుంది. ఈ క్రమంలో మరో రెండు వారాల పాటు.. అంటే.. మే 31వ తేదీ వరకు లాక్‌డౌన్ 4.0 కొనసాగుతుందని తెలుస్తోంది.