దేశంలో లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా తొలి విడత కింద 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటలకు ఓటింగ్ ముగియనుంది. తొలి దశలో 8.4 కోట్ల మంది పురుషులు, 8.23 మంది మహిళలు, 11,371 ఇతరులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తొలి దశలో కీలక స్థానాల్లో పలువురు ప్రముఖులు బరిలోకి దిగారు. అయితే ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ ఓటర్లకు ఓ విజ్ఞప్తి చేశారు.
ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నా ఓటర్లు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వచ్చి ఓట్లు వేస్తారని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక్క ఓటు కూడా ఎంతో కీలకమని దాని విలువను తక్కువగా అంచనా వేయకండని తెలిపారు. ఒకే ఒక్క ఓటు అత్యంత కీలకంగా నిలిచిన సందర్భాలు అనేకం ఉన్నాయన్న ఆయన.. పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. భారత ప్రజాస్వామ్యంలో ఓటింగుకు మించింది మరొకటి లేదని వ్యాఖ్యానించారు.