డీప్ ఫేక్.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ ఏఐ టెక్నాలజీ లోక్ సభ ఎన్నికల్లో కలకలం రేపుతోంది. ఈ ఎన్నికల్లో డీప్ ఫేక్ ద్వారా క్రియేట్ చేస్తున్న వీడియోలు సంచలనం రేపుతున్నాయి. అది నిజమో కాదో తెలుసుకోలేకుండా ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఇక ప్రముఖుల డీప్ ఫేక్ వీడియోలు వారి ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నాయి. ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ఓ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.
తాజాగా మరో స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ డీప్ ఫేక్ వీడియో నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అయితే ఈ వీడియోలో రణ్ వీర్ ఓ రాజకీయ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తూ.. మరో పార్టీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఓ ఫ్యాషన్ షో కోసం ఇటీవల వారణాసిలో పర్యటించిన రణ్‌వీర్ అక్కడ పొందిన అనుభూతిని మీడియాకు వివరించారు. ఈ వీడియోనే వాడి ఏఐతో డీప్ ఫేక్ క్రియేట్ చేసినట్లు ఈ వీడియోలో చూడొచ్చు.