రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఒకప్పటి ఆయన సహాయకుడే వీటిని చేశారు. గహ్లోత్ తనకు కొందరు మంత్రుల ఆడియో క్లిప్స్ ఇచ్చి వాటిని మీడియాకు విడుదల చేయాలని చెప్పినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో గహ్లోత్ వద్ద ఓఎస్ఓగా పనిచేసిన లోకేశ్ కుమార్ విచారణ ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.
‘ఈ కేసులో దిల్లీలోని క్రైమ్ బ్రాంచ్ తనను ఎన్నిసార్లు విచారించినా ఇప్పటివరకు మౌనంగా ఉన్నాను. కానీ, అసలు ఈ ఘటనకు కారకులైన వ్యక్తి నన్ను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారు. సోషల్ మీడియా ద్వారా రికార్డింగ్స్ నాకు అందాయని నేను గతంలో చెప్పాను. అది నిజం కాదు. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కాంగ్రెస్ నేత భన్వర్లాల్ శర్మతో సహా మరికొందరి వాయిస్లను గహ్లోత్ నాకు ఓ పెన్ డ్రైవ్లో ఇచ్చారు. వాటిని మీడియాకు విడుదల చేయమని చెప్పారు. మాజీ సీఎం నాయకత్వంలోని సమస్యల గురించి చెప్పేందుకు సచిన్ పైలట్, ఆయన సన్నిహితులు కాంగ్రెస్ హై కమాండ్ వద్దకు వెళ్లారని తెలియగానే వారి ఫోన్లను ట్యాప్ చేయించారు. అలాగే పైలట్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలను దెబ్బతీశారు. గహ్లోత్ ప్రభుత్వాన్ని పడగొట్టడం వెనక భాజపా ఉందనడం నిజం కాదు’ అని ఆరోపించారు.