టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అన్యాయం అని, ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని లోకేశ్ జాతీయ మీడియాకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీలో లోకేశ్ ను కలిశారు. ఈ సందర్భంగా తాజా పరిణామాలపై ఇరువురు చర్చించుకున్నారు. తమ భేటీ గురించి రఘురామ ఎక్స్ లో ఆసక్తికరంగా స్పందించారు. లోకేశ్ తో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న ఫొటో పంచుకున్న ఆయన… ‘సాక్షి’ గ్యాంగ్ ఏడవాలి అంటే మేం ఈ మాత్రం నవ్వాలిగా అని పేర్కొన్నారు. ఈ ఫోటోలకు సోషల్ మీడియాలో విశేష స్పందన వస్తోంది.
ఇదిలా ఉంటే.. అంతకు ముందు లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు జరిగిన అన్యాయం గురించి చెప్పేందుకే తాను ఢిల్లీ వచ్చానని స్పష్టం చేశారు. చంద్రబాబు పట్ల ఎలా వ్యవహరించారో దేశ ప్రజలకు వివరిస్తానని తెలిపారు. నీతిపరులను అవినీతిపరులు జైలుకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు లోకేశ్. అపరిమిత అధికారం అవినీతికి దారితీస్తుందని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ అంశంలో ఆరోపణలు అయితే చేశారు కానీ, అవినీతి జరిగిందని నిరూపించలేకపోయారని లోకేశ్ వెల్లడించారు. చంద్రబాబుకు డబ్బు అందిందని నిరూపించలేకపోయారని లోకేశ్ తెలిపారు.