అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇందులో A14గా నారా లోకేష్ ను చేర్చిన సిఐడి… ఇవాళ ఏసిబి కోర్టులో మెమో దాఖలు చేసింది. ఇదే కేసులో A1గా ఉన్న చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టులో దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై మధ్యాహ్నం వాదనలు మొదలవుతాయి. అయితే.. ఈ కేసుపై నారా లోకేష్ స్పందించారు.
యువగళం పేరు వింటే సైకో జగన్ గజగజలాడుతున్నాడని ఫైర్ అయ్యారు నారా లోకేష్. నా పాదయాత్ర ఆరంభం కాకూడదని జీవో 1 తెచ్చినా, ఆగని యువగళం జనగళమై గర్జించింది. ఎక్కడికక్కడ అడ్డుకున్నా జనజైత్రయాత్రగా ముందుకు సాగింది. మళ్లీ యువగళం ఆరంభిస్తామనే సరికి, నా శాఖకి సంబంధంలేని, అసలు వేయని రింగ్ రోడ్డు కేసులో నన్ను ఏ14గా చేర్పించారీ 420 సీఎం. రిపేర్ల పేరుతో రాజమహేంద్రవరం బ్రిడ్జి మూసేయించారని మండిపడ్డారు. నువ్వెన్ని తప్పుడు కేసులు పెట్టి, అక్రమ అరెస్టులు చేసినా నా యువగళం ఆగదు. ఎన్ని అడ్డంకులు కల్పించినా జనచైతన్యమే యువగళాన్ని వినిపిస్తుంది, ఇచ్ఛాపురం వరకూ నడిపిస్తుందన్నారు.