అగ్రవర్ణాల పేదలకు కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ కల్పిస్తాననడం మంచి పరిణామమని లోక్ సత్తా జాతీయ కన్వీనర్ జయప్రకాష్ నారాయణ అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 50 శాతానికే రిజర్వేషన్ పరిమితి ఉంది, అలాంటప్పుడు ఉన్న రిజర్వేషన్ లో 10 శాతం తగ్గించి అగ్రవర్ణాలకు ఇస్తారా..లేక కోర్టు ద్వారా 10 శాతం పెంచి కల్పిస్తారో అనే విషయం పై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలన్నారు. బడుగు,బలహీన వర్గాలతో పాటు అగ్రవర్ణాల్లోనూ పేదలు ఉన్నారని ఆయన గుర్తు చేశారు. రిజర్వేషన్ వర్గాలలో నిజమైన నిరుపేదలకు ఫలాలు అందటం లేదని జేపి ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ పొందుతూ ఒక స్థాయికి చేరిన వ్యక్తులు, సామాజిక బాధ్యతగా రిజర్వేషన్ వదులుకొని తమ కులంలోని మరి కొంత మంది పేదలకు అవకాశం కల్పించాలని ఆయన సూచించారు.
వీటితో పాటు దేశంలో నాణ్యమైన విద్యా, వైద్యాన్ని దేశంలోని అన్ని వర్గాలకు ఉచితంగా అందించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కులాల ప్రాతిపధిక ఆధారంగా ప్రతిభను గుర్తిస్తామనటం సరికాదని హితవు పలికిన ఆయన … అగ్రవర్ణాలకు రిజర్వేషన్ సాకారం అయినా కాకపోయినా దేశవ్యాప్తంగా ఈ విషయంపై చర్చ జరిగే అవకాశం ఉందన్నారు.