గుజ‌రాత్‌లో మ‌రో భారీ నిర్మాణం.. విగ్ర‌హం కాదు, స్టేడియం..!

-

గుజ‌రాత్‌లోని న‌ర్మ‌దా న‌దిపై ఉన్న స‌ర్దార్ స‌రోవ‌ర్ డ్యామ్ స‌మీపంలో ఇటీవ‌లే స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ భారీ విగ్ర‌హాన్ని నిర్మించారు క‌దా. దాదాపు 600 అడుగుల ఎత్తుతో ప్ర‌పంచంలోనే అత్యంత భారీ విగ్ర‌హంగా ఈ విగ్రహం రికార్డుల‌కెక్కింది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీగా ఈ విగ్ర‌హాన్ని వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే ఇప్పుడు గుజ‌రాత్ మ‌రోసారి అంత‌ర్జాతీయ ఖ్యాతికి వేదిక కానుంది. ఎందుకంటే అక్క‌డ ఇప్పుడు ప్ర‌పంచంలోనే అత్యంత భారీదైన క్రికెట్ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు మ‌రి..!

గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌లో ఉన్న మొతెరాలో ప్ర‌పంచంలోనే అత్యంత పెద్ద‌దైన క్రికెట్ స్టేడియాన్ని గుజ‌రాత్ క్రికెట్ అసోసియేష‌న్ నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం ఈ స్టేడియం నిర్మాణ ద‌శ‌లో ఉండ‌గా, అందుకు సంబంధించిన ఫొటోల‌ను గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పరిమల్ నత్వాని తాజాగా ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఆ ఫొటోలు నెట్‌లో వైర‌ల్ అవుతున్నాయి. ఈ స్టేడియం నిర్మాణం పూర్త‌యితే ప్ర‌పంచంలోనే అత్యంత భారీ క్రికెట్ స్టేడియంగా ఈ స్టేడియం నిలుస్తుంది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం పేరిట ఉన్న రికార్డు చెరిగిపోనుంది.

ఇక మొతెరా క్రికెట్ స్టేడియం విశేషాల‌కు వ‌స్తే… 2018లో ఈ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎల్ అండ్ టీ కంపెనీ ఈ స్టేడియాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. మొత్తం 63 ఎక‌రాల స్థ‌లంలో ఈ స్టేడియం నిర్మాణ‌మ‌వుతుండ‌గా, ఇందులో ఒకేసారి ఏకంగా 1.10 ల‌క్ష‌ల మంది కూర్చుని క్రికెట్‌ను వీక్షించ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం కెపాసిటీ 90 వేలు మాత్ర‌మే. దీంతో ఆ స్టేడియం రికార్డు త్వ‌ర‌లో క‌నుమ‌రుగు కానుంది.

మొతెరా క్రికెట్ స్టేడియాన్ని రూ.700 కోట్ల భారీ వ్య‌యంతో నిర్మిస్తున్నారు. స్టేడియంలో మొత్తం 4 డ్రెస్సింగ్ రూమ్‌లు, 50 గ‌దుల క్ల‌బ్ హౌస్, 76 కార్పొరేట్ బాక్సులు, భారీ స్విమ్మింగ్ పూల్‌, ఇండోర్ క్రికెట్ ట్రెయినింగ్ అకాడ‌మీ ఉంటాయి. ఇక స్టేడియంలో 3వేల కార్లు, 10వేల టూవీల‌ర్ల‌ను పార్క్ చేసుకోవ‌చ్చు. మ‌రి ఈ స్టేడియం ఎప్పుడు అందుబాటులోకి వ‌స్తుందో.. వేచి చూస్తే తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news