నగరాలు, పట్టణాల్లో పెరిగిపోతున్న గాలి కాలుష్యం వల్ల మనకు అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉన్న ఢిల్లీ వంటి నగరాల్లో అయితే ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా వస్తున్నట్లు గతంలో సైంటిస్టులు తెలిపారు. అయితే దీర్ఘకాలం పాటు గాలి కాలుష్యం బారిన పడితే చూపు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుందని, దాన్ని మళ్లీ తిరిగి తీసుకురాలేమని సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది.
దీర్ఘకాలం పాటు గాలి కాలుష్యానికి గురయ్యే వారికి దృష్టిలోపం లేదా చూపును పూర్తిగా కోల్పోవడం వంటి సమస్యలు వస్తున్నట్లు సైంటిస్టులు గుర్తించారు. ఈ మేరకు కొందరు సైంటిస్టులు అత్యంత సుదీర్ఘ కాలం పాటు ఈ విషయంపై అధ్యయనం చేపట్టి వివరాలను వెల్లడించారు. ఇందులో మొత్తం 1.15 లక్షల మంది ఆరోగ్య వివరాలను సైంటిస్టులు ఎప్పటికప్పుడు పరిశీలించారు. వారిలో కొందరికి ఆరంభంలో.. అంటే.. పరిశోధన ప్రారంభించిన సంవత్సరం 2006లో ఎలాంటి దృష్టి సమస్యలు లేవని.. అయితే కొన్ని సంవత్సరాల తరువాత కొందరికి ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డిజనరేషన్ (ఏఎండీ) అనే వ్యాధి వచ్చిందని, చూపు కోల్పోయారని గుర్తించారు. 50కి పైగా వయస్సు ఉన్నవారిలో ఈ సమస్య వచ్చిందని, వారందరూ నిత్యం అధికంగా కాలుష్యం బారిన పడ్డారని, ఇలా కొన్నేళ్ల పాటు జరగడం వల్లే వారికి అంధత్వం వచ్చిందని సైంటిస్టులు తేల్చారు.
అయితే వయస్సు మీద పడడం వల్ల సహజంగానే చాలా మందికి చూపు నశిస్తుంటుంది. స్పష్టంగా కనిపించదు. కానీ వారు సుదీర్ఘకాలం పాటు గాలి కాలుష్యం బారిన పడితే వారికి అంధత్వం వచ్చేందుకు అవకాశం ఉంటుందని సైంటిస్టులు తెలిపారు. ఈ క్రమంలో 2040 వరకు ప్రపంచంలో దాదాపుగా 30 కోట్ల మందికి ఈ విధంగా సమస్యలు వచ్చే అవకాశం ఉందని తేల్చారు. కనుక వీలైనంత వరకు గాలి కాలుష్యం బారిన పడకుండా ఉండాలని సూచిస్తున్నారు.