మనలో చాలా మంది పెద్దగా సౌండ్ పెట్టి మ్యూజిక్ వింటుంటారు. కొందరు మూవీలు చూస్తుంటారు. ఇంకొందరు టీవీలు వీక్షిస్తుంటారు. ఇక నిత్యం కొందరు పనిచేసే ప్రదేశాల్లో, ఇతర ప్రాంతాల్లో పెద్ద పెద్ద శబ్దాలను వినాల్సి వస్తుంటుంది. అయితే ఇలా పెద్దవైన శబ్దాలను వినడం మన ఆరోగ్యానికి మంచిది కాదని సైంటిస్టులు చెబుతున్నారు. దాంతో మనకు పలు అనారోగ్య సమస్యలు వస్తాయని వారు అంటున్నారు.
జర్మనీకి చెందిన యూనివర్సిటీ మెడికల్ సెంటర్ ఆఫ్ మయింజ్ పరిశోధకుడు మాథియాస్ ఓలెజ్ ఇటీవల ఎలుకలపై ప్రయోగాలు చేశారు. 4 రోజుల పాటు కొన్ని ఎలుకలకు నిత్యం విమానాలు వెళ్లేటప్పుడు వచ్చే శబ్దాలను వినిపించారు. దీంతో వాటిలో సహజంగానే బీపీ పెరిగి హైబీపీ వచ్చింది. ఇక కొన్ని ఎలుకలకు గుండె సమస్యలు వచ్చాయి. అలాగే ఆ శబ్దాల వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుందని, డీఎన్ఏ నాశనం అయ్యేందుకు అవకాశాలు ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు.
కనుక ఎవరైనా సరే.. పెద్ద శబ్దాలకు దూరంగా ఉండడం వల్ల పైన తెలిపిన అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చని సదరు సైంటిస్టులు సూచిస్తున్నారు.