తాను ప్రేమించిన యువతికి జరిగిన అవమానాన్ని భరించని ప్రియుడు విభిన్న రీతిలో ప్రతీకారం తీర్చుకుని జైలు పాలయ్యాడు. తమిళనాడుకు చెందిన తమిళ సెల్వన్ కన్నన్ (24), 2015లో తన ప్రియురాలిని అసభ్యకరంగా చిత్రీకరించి,సైబర్ వేధింపులకు గురి చేసిన ఆమెతో పాటు వైద్య విద్యార్ధులందరీపై ప్రతీకారం తీర్చుకోవాలని డిసైడయ్యాడు. అందుకు విభిన్న రీతిని ఎంచుకున్నాడు. ప్రతీకారంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న వైద్యవిద్యార్ధుల ల్యాప్‌టాప్‌లను టార్గెట్ చేసి దొంగతనాలకు శ్రీకారం చుట్టాడు. గుజరాత్‌లోని జామ్‌నగర్ పోలీసులు ఇటీవల ఓ ల్యాప్‌టాప్ దొంగను అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా.. ఈ వింత విషయాలు వెలుగు చూశాయి.
500 ల్యాప్‌టాప్‌లు..
అయితే.. తమిళ సెల్వన్ ప్రతీకార చర్యల నేపథ్యంలో ఇప్పటి దాకా దాదాపుగా 500 మంది వైద్య విద్యార్థినుల ల్యాప్‌టాప్‌లు అపహరించినట్లు విచారణలో తెలపడంతో పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. చోరీ ప్రణాళికల్లో భాగంగా నిందితుడు ఇంటర్నెట్‌లో దేశంలోని మెడికల్ కాలేజీల వివరాలు, అక్కడున్న బందోస్తు, ఒక్కో గదిలో ఉంటున్న విద్యార్థినులు సంఖ్య తదితర వివరాలు సేకరించేవాడు. ఆ తర్వాత ఆయా కాలేజీ వద్ద రెండు, మూడ్రోజుల రెక్కీ నిర్వహించి పథకం ప్రకారం ట్యాప్‌టాప్‌లను ఎత్తుకెళ్లేవాడని పోలీసుల ముందు ఒప్పుకున్నారు. చోరి చేసిన ల్యాప్‌టాప్‌లు ఎక్కువగా దక్షిణ భారత దేశంలోని మెడికల్ కళాశాలకు చెందిన విదార్థులవిగా తేలింది. నిందితుడు చివరిగా డిసెంబర్‌లో జామ్ నగర్‌లోని ఎంపీషా మెడికల్ కాలేజీ బాలికల హాస్టల్ నుంచి ఏకంగా ఐదు ల్యాప్‌టాప్‌లు దొంగిలించినట్లు స్థానిక పోలీసులు పేర్కొన్నారు. ప్రియురాలికి జరిగిన అవమానానికి ప్రతీకారంగా ల్యాప్‌టాప్‌లు చోరీలు చేసి కటకటాల పాలయ్యాడు.