కరోనా వైరస్.. ఎప్పుడు.. ఎలా.. ఎవరిని కాటేస్తుందో చెప్పాలేని పరిస్థితి. ఇప్పటికే వేల మందిని కబళించిన కరోనా.. రోజురోజుకు వేగాన్ని పెంచుకుంటూ పోతోంది. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రపంచదేశాలు దీంతో యుద్ధానికి దిగాయి. అయినప్పటికీ కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అందుకే అధికారులు వ్యక్తిగత దూరం పాటించాలి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ ప్రజలకు రోజూ సూచిస్తూనే ఉన్నారు. కానీ, కొందరు మాత్రం వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు.
అయితే నిన్న మధ్యప్రదేశ్ లో ఓ టిక్ టాక్ స్టార్ మాస్క్ లను ధరించడం ఎందుకని ఎగతాళి చేస్తూ.. దేవుడిని నమ్ముకుంటే చాలని వీడియోను పోస్ట్ చేశాడు. కరోనాకి కోపం వచ్చిందో.. ఏమో.. తెలియదుగాని.. నేడు సదరు టిక్ టాక్ స్టార్‌ను పట్టేసింది. జబల్పూర్ లోని తన సోదరి ఇంటికి వెళ్లి వచ్చిన తరువాత ఇతనికి కరోనా సోకింది. దీంతో అతడు ప్రస్తుతం హాస్పటల్‌లో ఐసొలేషన్ వార్డులో పడ్డాడు. మరోవిషయం ఏంటంటే.. తన కోసం దేవుడిని ప్రార్థించాలంటూ ఆ తరువాత కూడా అతను వీడియోలు పోస్ట్ చేయడం గమనార్హం. విషయం తెలుసుకున్న పోలీసులు అతడి దగ్గర నుంచి ఫోన్ లాక్కుని కంట్రోల్ చేశారట.
వాస్తవానికి గాల్లో దీపం పెట్టి.. దేవుడా! భారం అంతా నీదే అంటే ఉంటుందా..? ఇక్కడ కూడా అదే జరిగింది. దేవుడు ఉన్నాడు.. మాస్క్‌లు, వ్యక్తిగత దూరం ఎందుకు అనుకున్నాడు కాబట్టే.. ఇప్పుడు కరోనాతో ఈ టిక్ టాక్ స్టార్ బాధపడాల్సి వస్తుంది. ఇక అతని బాధ్యతా రాహిత్యం కారణంగా చుట్టుపక్కల వారు, కుటుంబీకులు సహా మొత్తం యాబై మంది క్వారంటైన్ కావాల్సి వచ్చింది. ఈ కరోనా మహమ్మారిని నిర్లక్ష్యం చేసి అజాగ్రత్తగా ప్రవర్తిస్తే.. మీతో పాటు మీ కుటుంబీకులు మరియు ఇతరులు కూడా రిస్క్‌లో పడాల్సి వస్తుంది. సో.. బీకేర్‌ఫుల్..!!