శివరాత్రి సందర్భంగా శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాలధారణలు, విభూతి ధారణలు, జాగరణలు చేస్తారు. అయితే ఈ పూజ ఎందుకు చేయాలి, దీని వెనుక ఉన్న ఆంతర్యామేమిటో ఆ పరమ శివుడే స్వయానా పార్వతి మాతకు చెప్పాడు.శివుడి ఆజ్ఞలేనిదే చీమైన కుట్టదు అనే విషయం అందరికి తెలిసిందే. దైవాజ్ఞ లేకుండా ఏమి జరగవని ఈ విషయం ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా శివరాత్రి రోజు పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏమి జరగవు. అసలు ఈ పండుగ ప్రతి ఏటా నిర్వహించుకుంటున్న మనం దీనికి వెనుక ఉన్న అసలు చరిత్ర ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
పూర్వం ఓ బోయవాడు ఉండేవాడు. అతడు అడవికి వెళ్లి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. అయితే ఒకరోజు వేటకు వెళ్లిన అతడికి ఒక్క మృగం కూడా కనిపించలేదు.సాయంత్రం గడిచినా ఫలితం దొరకపోవడంతో నిరాశగా ఇంటిముఖం పట్టాడు. మార్గమధ్యలో ఓ సరస్సు కనిపించింది. దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తే దానిన వేటాడవచ్చని భావించి దగ్గర్లోని ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అప్పుడు అతడు తన ఊతపదమైన శివ శివఅనడం మొదటుపెట్టాడు. అది మంచో చెడో కూడా అతడికి తెలియదు. చెట్టుపైనుంచి జంతువులను వేటాడానికి వీలుగా సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు, కొమ్మలు విరుస్తున్నాడు.
ఓ ఆడజింక అటుగా వచ్చింది. దాని మీదకు బాణం ఎక్కుపెట్టగా.. జింక మానవ గొంతులో తనను సంహరించవద్దని వేటగాడిని ప్రార్థించింది. తనను చంపటం అధర్మమంటూ, ప్రాణభిక్షణ పెట్టమని ప్రాధేయపడింది. మాములుగా అయితే అతడి మనస్సు క్రూరంగా ఉండేది. కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏమీ చేయలే దాన్ని వదిలేశాడు. అలా రెండో రోజు కూడా గడిచింది. ఇంతలో ఇంకొక ఆడ జింక అటుగా వచ్చింది. దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా.. తను బక్కపల్చగా ఉన్నానని, తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదని అందుకే తనను విడిచిపెట్టమని కోరింది. మరికొద్దిసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే నేనే తిరిగివస్తానని వేడుకొంది. ఆ జింకను కూడా విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురుచూశాడు.
ఇంతలో మూడో జాము గడిచింది. అప్పుడు ఓ మగ జింక అతడికి కనిపించింది. దానిపై బాణాన్ని ఎక్కుపెడదామనుకునే సరికి ఆ మగ జింక కూడా మానవభాషలో మాట్లాడింది. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా? అని అతడిని అడిగింది. వచ్చాయని, తనకు ఏ జంతువు దొరక్కపోతే తామే వస్తామని తనకు చెప్పినట్లు కూడా వేటగాడు మగజింకకు చెప్పాడు. అప్పుడా ఆ మగజింక అయితే ఆ రెండు జింకలను ఓ సారి చూసి వస్తానని అప్పుడు తనను చంపమని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇంతలో నాలుగో రోజ సూర్యోదయమైంది. తనకు మాటిచ్చిన మూడు జింకల కోసం ఎదురుచూస్తూ చెట్టుమీదనే కూర్చున్నాడు వేటగాడు.
మరోక జింక, దాని పిల్ల అటుగా రావడం గమనించాడు. విల్లెక్కుపెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్ద విడిచి వస్తానని అప్పటివరకు ఆగమని పలికి చెప్పి వెళ్లింది. మరికొద్ది సేపటికి నాలుగు జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం వచ్చి తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకొచ్చింది.
ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతడికి తెలియకుండానే శివ నామస్మరణం చేయడం, తన చూపునకు అడ్డువచ్చిన మారేడు ఆకులు కోసి కిందపడేటం చేశాడు. ఆ చెట్టుకిందనే ఓ పాత శివలింగం ఉండటం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి. దీంతో పూజా ఫలితాన్నిచ్చింది. నాలుగో జాము వరకు మెలకువతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం వచ్చింది.
ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ఠ అతడిని పూర్తిగా మార్చి వేసింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజా ఫలం అతడు హింసను విడనాడినాడు. జింకలు పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారాయి. వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు.
నాటి నుంచి సాధారణ మానవులు కూడా ఇలాగే మారేడు దళలతో శివపూజ చేస్తున్నారు. ఆ రోజు శివుని పుట్టిన రోజని చెబుతారు. అందుకే ఆ దినం శివుడికి ఇష్టమైన శివరాత్రి అయింది.