టీడీపీ మహానాడుకు సిద్ధం అయి ఉంది. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్నారు. గెలుపు ఓటమి అన్నవి కాదు ప్రజలతోనే నిరంతరం ఉండాలన్న తలంపుతో పనిచేస్తున్నారు. ఒక విధంగా వైసీపీ తప్పిదాలను వెలుగులోకి తెస్తూనే, వాటికి ఆధారాలు కూడా చూపిస్తున్నారు. మీడియా పరంగా కూడా టీడీపీ కి మంచి మద్దతు ఉంది కనుక అప్పటి కన్నా ఇప్పుడు మరింత వేగంతో పనిచేసి ఫలితాలు అందుకోవాలని, ఈ సారి పోయిన పరువును తిరిగి దక్కించుకోవాలని చూస్తున్నారు. ఆ విధంగా పెద్దాయన నిరంతరం పార్టీ శ్రేణులతో మమేకం అవుతున్నారు. మహానాడు తరువాత పార్టీలో కూడా కొన్ని మార్పులు ఉండనున్నాయి. అవన్నీ కూడా రేపటి ఎన్నికల యుద్ధానికి సహకరించేవే కానున్నాయని అధినేత అంటున్నారు తన సన్నిహిత వర్గాలతో !
ఎన్నికలకు ఎంత దూరం ఉందో అన్నది తెలియదు కానీ జగన్ మాత్రం ఫుల్ స్పీడులో ఉన్నారు. కుర్రాడు కదా ఆ విధంగాఉండడం తప్పు కాదు. ఆయన కన్నా స్పీడుగా ఉన్నా 72 ఏళ్ల పెద్దాయన చంద్రబాబు. ప్రతిరోజూ ఏదో ఒక విషయమై మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. వాటికి సంబంధించి ఆయన గణాంక సహితంగా వివరిస్తు ఉన్నారు. ఆ విధంగా అధికార పార్టీని ఆయన ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. ఓ విధంగా టీడీపీలో చంద్రబాబును దాటించి మాట్లాడిన లేదా మాట్లాడుతున్న నేతలు లేరు అనేందుకు నిదర్శనమో లేదా తార్కాణమో అంటే ఇదే ! ఎందుకంటే లోకేశ్ మాట్లాడినా అన్ ఎక్స్‌పెక్టెడ్ రీచ్ ఉండదు కానీ బాబు మాట్లాడితే ఆ లెక్కే వేరు.
తాజాగా రాష్ట్ర ప్రజలు ఏం పాపం చేశారు అని ప్రశ్నిస్తున్నారాయన. పెట్రో భారం విషయమై రాష్ట్రం ఎందుకు తన వాటా పన్నులు తగ్గించుకోలేకపోతుందని ప్రశ్నిస్తున్నారాయన. పెట్రో భారం కేంద్రం తగ్గించినా మీరెందుకు తగ్గించరు అని నిలదీస్తున్నారాయన. టీడీపీ హయాంలో అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతే, సీఎంగా ఉన్న జగన్ హయాంలో పన్నుల భారంలో ప్రథమ స్థానంలో ఉందని మండిపడుతున్నారాయన. పన్నుల విషయమై ఇప్పటికే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందని, తాము చేపట్టిన బాదుడే బాదుడ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోందని చెబుతున్నారీయన. ఏదేమయినప్పటికీ త్వరలో బస్సు యాత్ర చేపట్టి ప్రజల్లోకి వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు చంద్రబాబు. ఇదే సమయంలో లోకేశ్ తో పాదయాత్ర చేయించాలని కూడా యోచిస్తున్నారు.