కలబంద (అలోవెరా) మన చర్మాన్ని సంరక్షిస్తుంది. చర్మాన్ని మృదువుగా మార్చుతుంది. చర్మ సమస్యలను పోగొడుతుంది. అందుకే అనేక సౌందర్య సాధన ఉత్పత్తుల్లో అలోవెరాను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే అలోవెరాతో ఇంట్లోనే సబ్బులను తయారు చేసి అమ్మడం వల్ల చక్కని ఆదాయం పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
1 కిలో అలోవెరా సబ్బును తయారు చేసేందుకు దాదాపుగా 110 గ్రాముల కలబంద గుజ్జు అవసరం అవుతుంది. అలాగే 110 ఎంఎల్ కాస్టిక్ సోడా, 750 ఎంఎల్ ఆలివ్ ఆయిల్, 250 ఎంఎల్ నీరు అవసరం. కలబంద గుజ్జు, కాస్టిక్ సోడా, ఆలివ్ ఆయిల్‌లను మార్కెట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇక సువాసన కోసం లావెండర్ ఆయిల్, రోజ్ వాటర్‌ను కొనవచ్చు. ఇక సబ్బును ఎలా తయారు చేయాలంటే…
బాగా గాలి తగిలే చోటును సబ్బు తయారీకి ఎంచుకోవాలి. చేతులకు గ్లౌజులు వేసుకోవాలి. నీటిని మరిగించి ఓ ప్లాస్టిక్ డబ్బాలో పోయాలి. దీనికి కాస్టిక్ సోడా బాగా కలపాలి. ఈ మిశ్రమం చల్లబడేందుకు సమయం పడుతుంది. అప్పటి వరకు దాన్ని అలాగే ఉంచాలి. సుమారుగా గంట తరువాత మిశ్రమం చల్లారుతుంది. అయితే అంతలోపు ఆలివ్ ఆయిల్, కలబంద గుజ్జులను సిద్ధం చేసుకోవాలి. కలబంద గుజ్జు జెల్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం ఆలివ్ ఆయిల్‌ను వేడి చేసి దాన్ని చల్లారిన మిశ్రమంలో పోసి బాగా కలపాలి. మిశ్రమం చిక్కగా అయ్యేంత వరకు కలపాలి. అనంతరం అందులో కలబంద గుజ్జును కూడా వేసి బాగా కలపాలి. అయితే ఇందులో లావెండర్ ఆయిల్, రోజ్ వాటర్‌లను కలిపితే సువాసన వస్తుంది. ఇక సిద్ధమైన మిశ్రమాన్ని అచ్చుల్లో పోయాలి. దీంతో ఒక రోజు తరువాత ఆ మిశ్రమం ఘన పదార్థంగా మారుతుంది. ఇలా సబ్బులు తయారవుతాయి.
ఈ విధంగా పూర్తిగా సహజసిద్ధమైన పద్ధతిలో అలోవెరా సబ్బులను తయారు చేయవచ్చు. అయితే అలోవెరాకు బదులుగా భిన్నమైన పదార్థాలతోనూ సబ్బులను పై విధంగా తయారు చేసుకోవచ్చు. దీంతో రక రకాల ఫ్లేవర్లకు చెందిన సబ్బులను ఇంట్లోనే తయారు చేసి అమ్మితే ఎక్కువ లాభాలు వస్తాయి. ప్రస్తుతం మార్కెట్‌లో 75 గ్రాముల నాచురల్ అలోవెరా సోప్ ధర రూ.45 వరకు ఉంది. అందులో సగం వరకు ఖర్చు.. అంటే దాదాపుగా రూ.22 తీసేసినా.. రూ.23 లాభం ఉంటుంది. ఇక హోల్‌సేల్ వ్యాపారులకు అమ్మదలిస్తే వారికి మార్జిన్ ఇవ్వాల్సి ఉంటుంది కనుక.. అందులోంచి మరో రూ.5 తీసేస్తే.. రూ.18 అవుతుంది. ఈ క్రమంలో నిత్యం 100 సబ్బులను తయారు చేయగలిగితే 100 * 18 = రూ.1800 అవుతాయి. నెలకు 30 * 1800 = రూ.54,000 అవుతాయి. ఇలా సహజసిద్ధమైన సబ్బులను ఇంట్లోనే తయారు చేసి విక్రయిస్తూ.. నెల నెలా చక్కని ఆదాయం సంపాదించవచ్చు.