కరోనా లాన్‌డౌన్ నేపథ్యంలో దేశంలో అన్ని రంగాలు తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. చిన్న, మధ్య తరహా పరిశ్రమలైతే దాదాపుగా మూత పడే స్థితికి వచ్చాయి. ఇక పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి విలవిలలాడుతున్నారు. అయితే వారందరికీ వీనుల విందు చేసేలా ప్రధాని మోదీ రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ.. కరోనా లాక్‌డౌన్ పొడిగింపు, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కావల్సిన ఆర్థిక ప్యాకేజీపై వివరాలను ప్రకటించారు. ఇక ఇదే సందర్భంలో ఆయన మేడిన్ ఇండియా నినాదం ఎత్తుకున్నారు.
దేశంలో అనేక పరిశ్రమలు అధిక మొత్తంలో వస్తుత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయని.. అందువల్ల దేశంలో తయారయ్యే వస్తువులనే ఎక్కువగా వాడాలని మోదీ పిలుపునిచ్చారు. విదేశీ వస్తువుల వాడకాన్ని తగ్గించాలని, స్వదేశీ కంపెనీల వస్తువులను వాడితే.. మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని ఆయన అన్నారు. అయితే మోదీ ఎంత ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినప్పటికీ గతంలో ఎన్నడూ ఇలా నేరుగా స్వదేశీ నినాదం చేయలేదు. కానీ ఇప్పుడాయన ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.
అయితే స్వదేశీ వస్తువులను వాడమనే ఆయన చెప్పారు కానీ.. దేశంలో ఇప్పటికే అనేక విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఇకపై కూడా రానున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమవుతోంది. మరి దీనిపై అటు బీజేపీ శ్రేణులు, ఇటు మోదీ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి..!