చేవెళ్ల ప్రజాగర్జన కాంగ్రెస్ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమం గుర్తు చేసుకుంటే దుఖం వస్తుందని, తెలంగాణ ఉద్యమంలో అనేక మంది పాల్గొన్నారన్నారు. తెలంగాణ వల్ల ఒకే కుటుంబం లాభపడిందని, తెలంగాణ ప్రజల కోసం రాష్ట్రం ఇచ్చారన్నారు. తెలంగాణ తెచ్చే శక్తి కేసీఆర్‌కు ఎక్కడిది?. కేసీఆర్‌కు బలం ఇచ్చింది మేమే అని ఆయన అన్నారు. మాకు మద్దతు ఇవ్వాల్సిన కేసీఆర్ ఇవ్వలేదని ఆయన వెల్లడించారు.
తమ హయాంలోనే ఆహార భద్రత చట్టాన్ని తెచ్చామని మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెసేతర
ప్రభుత్వాలు దేశానికి ఏం చేశాయని ఆయన ప్రశ్నించారు. నెహ్రూ, పటేల్ కలిసి చిన్నచిన్న రాజ్యాలను ఏకం చేశారని, 53 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశాన్ని బలోపేతం చేశామని వివరించారు. దేశంలోని ప్రముఖ కంపెనీలతోపాటు హైదరాబాద్‌కు అనేక కంపెనీలను కాంగ్రెసే తెచ్చిందని ఖర్గే స్పష్టం చేశారు.
కేసీఆర్‌ను గద్దె దించడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారని మల్లిఖార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజల మనసు తెలుసుకుని సోనియా తెలంగాణ ఇచ్చారని, కానీ తన వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ చెప్పుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్.. సోనియా ఫొటో తీసుకుని బయటికివచ్చి మాట మార్చారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలందరి క్రెడిట్ అంతా ఒకే వ్యక్తి తీసుకున్నారని ఖర్గే అన్నారు.