కేంద్ర ప్రభుత్వం జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు లాక్‌డౌన్ 5.0ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే పలు ఆంక్షలకు సడలింపులు ఇచ్చారు. ఇక జూన్ 8 నుంచి దేశంలోని షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లను తెరుచుకునేందుకు కూడా అనుమతులు ఇచ్చారు. అయితే ఇందుకు గాను కేంద్రం తాజాగా పలు నియమ నిబంధనలను ప్రకటించింది. ఆ జాబితా ఇలా ఉంది.
* అన్ని ప్రదేశాల్లోనూ భౌతిక దూరం కచ్చితంగా పాటించాలి. వ్యక్తికి, వ్యక్తికి మధ్య కనీసం 6 అడుగులు ఉండేలా చూడాలి.
* ఫేస్‌మాస్కులు ఉన్నవారినే లోపలికి అనుమతించాలి. కస్టమర్లు శానిటైజర్లను వెంట ఉంచుకోవాలి. మాల్స్, రెస్టారెంట్ల వారు శానిటైజర్లను కస్టమర్లకు ఇవ్వాలి.
* ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ స్కీనింగ్ చేశాకే.. కరోనా లక్షణాలు లేని వారినే లోపలికి అనుమతించాలి.
* దగ్గినా, తుమ్మినా కర్చీఫ్ లేదా టిష్యూలను అడ్డుగా పెట్టుకోవాలి. తరువాత వాటిని నిర్దేశిత ప్రదేశాల్లో మాత్రమే పడేయాలి.
* బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు. వేస్తే జరిమానా విధించి చర్యలు తీసుకోవాలి.
* ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్‌ను వాడేలా చూడాలి.
* మాల్స్‌లో ఉన్నంత వరకు అందరూ కచ్చితంగా ఫేస్ మాస్కులను ధరించాలి.
* కరోనా వైరస్ వ్యాప్తిపై కస్టమర్లకు అవగాహన కలిగించేలా పోస్టర్లను అంటించాలి. ఆడియో, వీడియోల ద్వారా ప్రచారం చేయాలి.
* మాల్స్‌లో కస్టమర్లు భౌతిక దూరం పాటించేలా చూడాలి. అందుకు అవసరం అయితే సిబ్బందిని నియమించాలి.
* అనారోగ్య సమస్యలు ఉండే ఉద్యోగులు, గర్భిణీలు, వయస్సు ఎక్కువగా ఉన్నవారికి ఇంటి నుంచే పనిచేసే అవకాశం కల్పించాలి. లేదా ఫ్రంట్ లైన్ వర్కర్లకు దూరంగా ఉంచాలి.
* మాల్ బయట, లోపల పార్కింగ్‌ను మేనేజ్ చేయడంతోపాటు జనాల రద్దీ ఎక్కువగా లేకుండా చూడాలి.
* కస్టమర్లు లోపలికి వెళ్లేందుకు ఒక మార్గం, బయటకు వచ్చేందుకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేయాలి.
* లిఫ్ట్‌లో, ఎస్కలేటర్లపై భౌతిక దూరం పాటించేలా ఏర్పాటు చేయాలి.
* మాల్స్‌లో జనాలు పెద్దగా గుమిగూడేలా ఎలాంటి ప్రోగ్రామ్స్‌ను నిర్వహించకూడదు.
* మాల్‌కు వచ్చే వారిలో ఎవరికైనా కరోనా పాజిటివ్ అని తేలినా, ఒకటి, రెండు కేసులు నమోదైనా.. 48 గంటల పాటు ఆ ప్రాంతం మొత్తాన్ని బాగా శుభ్రం చేయాలి. మాల్ మూసేయాల్సిన పనిలేదు. మొత్తం బాగా శుభ్రం చేశాక మళ్లీ తెరవవచ్చు.
* భారీ ఎత్తున కరోనా కేసులు నమోదు అయితే మాత్రం మాల్‌ను పూర్తిగా శుభ్రం చేసి మూసేయాలి. ఎలాంటి ఇన్‌ఫెక్షన్ లేదని నిర్దారించుకున్నాకే మాల్‌ను మళ్లీ తెరవాలి.