కాల్చే ఆకలికి కూల్చే వేదనకి నేనున్నా అంటున్న-“మల్లుల సురేష్”

-

కన్న తల్లి తండ్రులకి పట్టెడు అన్నం పెట్టడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు ప్రస్తుత కాలంలో కొంతమంది  పిల్లలు. నవమాసాలు మోసి, కనీ పెంచిన తల్లి తండ్రులని వీధుల్లో అనాధలుగా వదిలేసి వెళ్ళిపోతున్నారు. రోడ్లపై ఉంటూ, వీధుల్లో తిరుగుతూ పట్టెడు అన్నం దొరకక అలమటిస్తూ ఒక గ్లాసు మంచినీళ్ళు త్రాగి, ఎవరైనా జాలి తలిచి ఒక ముద్ద అన్నం పెడితేనే వారికి ఆరోజు కడుపు నిండే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితులని చూసిన ఓ యువకుడు తట్టుకోలేక పోయాడు. వారికోసం ఏదైనా చేయాలని పరితపించాడు. అందరిలా అయ్యో పాపం అనుకుని వదిలేయలేదు. సంకల్పించాడు, ఆ సంకల్పం ఉక్కు సంకల్పంగా మారి కాలే కడుపులకి నిత్యాన్నదానంగా మారింది…వివరాలలోకి వెళ్తే….

అతని పేరు మల్లుల సురేష్. అతనొక సామాన్యుడే, సామాన్య జర్నలిస్ట్ గా తన ప్రయాణం మొదలు పెట్టి ఈనాడు వంటి సంస్థలో జిల్లా స్థాయి రిపోర్టర్ గా పనిచేశారు. తన ప్రతిభని గుర్తించిన రామోజీ రావు అతడికి స్టేట్ రిపోర్టర్ గా భాద్యతలు అప్పగించారు. అయితే ఉద్యోగం లోతులు చూసిన అతడికి వేలకు వేల జీతం వస్తున్నా ఎక్కడో చిన్న అసంతృప్తి నెలకొంది. పేద ప్రజలకి సేవ చేయాలనే ఆలోచనతో ఉద్యోగం, సేవ రెండిటికి న్యాయం చేయలేనని అనుకున్నాడు. వెంటనే ఎంతో ఉన్నతమైన ఉద్యోగానికి రాజీనామా చేసి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో విశ్వమానవ వేదిక అనే స్వచ్చంద సంస్థని ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలోనే రోడ్లపై, పుట్ పాత్ లపై, జనాలు తిరుగాడే ఇళ్ళ మధ్యలో ఎవరూ లేని అనాధలుగా ఉంటున్న వ్రుద్దులని చూసి చలించిపోయాడు.

వారి కడుపున నేను పుట్టలేదు కానీ వారిని అలా చూస్తూ ఉండలేను అంటూ  విశ్వమానవ వేదిక స్వచ్చంద సంస్థని ఏర్పాటు చేసి, ఉచిత వృద్దాశ్రమాన్ని నెలకొల్పాడు. మరి బయట ఇంకా కొంతమంది వృద్దులు ఆకలితో అలమటిస్తున్నారు ఎలాగంటూ ఓ ఆలోచన చేశాడు. అలాంటి వారి ఆకలి తీర్చడానికి వారి వద్దకే భోజనం తీసుకువెళ్తే బాగుంటుంది భావించి ఆ ఆలోచనకి నిత్యాన్నదానం అనే పేరు పెట్టాడు. 2015 న‌వంబ‌ర్ 17వ తేదిన  ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా పాలకొల్లు చుట్టుపక్కల ప్రాంతాలలో సుమారు 100 కి పైగానే అనాధ వృద్ధులకి భోజనాలు పంపిణీ చేస్తున్నారు. మధ్యలో ఎన్ని కష్టాలు ఎదురైనా, ఆర్ధిక ఇబ్బందులు వచ్చినా, రాజకీయంగా ఎన్నో అడ్డంకులు వచ్చినా ఒక్క సారికూడా ఆగకుండా నిరవధికంగా 1500 రోజులు వరకూ పూర్తి చేశాడు.

ఒక్క పూట అన్నం పెట్టడానికి నానామాటలు అంటూ మానసికంగా హింసకి గుర్తి చేస్తూ తల్లి తండ్రులని పురుగుల్లా చూస్తున్న బిడ్డలున్న ఈ సమాజంలో 1500 రోజులుగా ఉచితంగా అన్నదానం చేయడమా అంటూ అతడి సంకల్పాన్ని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు ఎంతో మంది. అతడికి సాయంగా మేమున్నాం అంటూ ఉచిత అన్నదాన పొట్లాలు అందించే భాద్యత తీసుకున్నారు. అతని కుటుంభ సభ్యులు సైతం మల్లుల సురేష్ చేస్తున్న సేవలలో భాగం అయ్యారు. సురేష్ తల్లి తండ్రీ, భార్యా, తమ్ముడు, స్నేహితులు ఇలా ఒకరు కాదు వందల మంది విశ్వమానవ వేదిక చేపట్టే ప్రతీ సేవా కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. ఇతడి నిస్వార్ధ సేవని గుర్తించిన కొంతమంది విరాళాలు  అందిస్తూ నిత్యాన్నదానంలో పరోక్షంగా భాగస్వాములు అవుతున్నారు.

పెళ్ళిళ్ళు, పుట్టిన రోజులు ఇలా ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా అనాధ వృద్ధులకి తమ పేరుతో నిత్యాన్నదానం భోజన పొట్లాలు అందిస్తున్నారు స్థానికులు. సురేష్ చేపట్టిన ఈ మహా సంకల్పాన్ని చూసిన ఎంతోమంది స్వచ్చంద సంస్థలు పాలకొల్లు వచ్చి ఈ నిత్యాన్నదాన కార్యక్రమ నిర్వహణ చూసి వారి వారి ప్రాంతాలలో ఈ సేవలని అమలు చేస్తున్నారు. తాను చేసే సేవలలో భాగస్వాములు కావాలనుకున్నా , విలువైన సూచనలు కావాలన్నా తప్పకుండా తనని సంప్రదించచ్చని అంటున్నాడు. ఈ యువకుడు చేసే సేవకి తప్పకుండా అందరి మద్దతు ఉండాలని, ఈ నిత్యాన్నదానం కార్యక్రమం దిగ్విజయంగా నిరాటకంగా మరింత ముందుకు వెళ్ళాలని మనమూ కోరుకుందాం..

 

 

Read more RELATED
Recommended to you

Latest news