మన దేశంలో 130 కోట్ల జనాభాలో ఇప్పటికీ.. ఇంకా.. 4.60 కోట్ల మంది అత్యంత నిరుపేదలు ఉన్నారని, వారిలో సగటున 5 మందిలో ఒకరు ఇప్పటికీ సరైన ఆహారం లేక చనిపోతున్నారని వెల్లడైంది.
మన దేశంలో ప్రజా ప్రతినిధులకు, రాజకీయ నాయకులకు ఎప్పుడూ ఒకర్నొకరు విమర్శించుకోవడమే పని. మీరు ప్రజలకు ఏం చేశారంటే.. మీరేం చేశారని.. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడానికి సమయమంతా సరిపోతుంది. ఇక చట్టసభల్లో అయితే ప్రజా సమస్యలను పరిష్కరిద్దాం, వారికి కావల్సిన కనీస సదుపాయాలను కల్పిద్దామనే ఆలోచన పాలకులకు, ప్రతిపక్షాలకు ఏ కోశానా ఉండదు. వెరసి దేశంలో ప్రజలు సమస్యలతో అల్లాడిపోతున్నారు. తమ గోడును పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూపీలో తాజాగా చోటు చేసుకున్న ఓ ఆకలి చావే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
ఉత్తరప్రదేశ్‌లోని కాస్గంగ్ ప్రాంతంలో ఉన్న బిల్‌రామ్ ఏరియా మహేష్ పూర్ రోడ్డులో నివాసం ఉండే పూరన్ సింగ్ (41)కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే పూరన్ సింగ్‌కు ఎక్కడ వెదికినా జాబ్ దొరకలేదు. చేసేందుకు కనీసం ఏ పని కూడా లభ్యం కాలేదు. దీంతో గత 5 రోజులుగా ఆ కుటుంబం తినడానికి తిండి లేక పస్తులుంటోంది. అతని పిల్లలు ఇరుగు పొరుగు ఇండ్లకు వెళ్లి యాచించి కడుపు నింపుకుంటున్నారు. కాగా ఆగస్టు 30వ తేదీన యథావిధిగా ఉద్యోగం కోసం పూరన్ సింగ్ బయటకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చి స్నానం చేశాడు. మళ్లీ బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. మరుసటి రోజు వారి ఇంటికి సమీపంలో ఉన్న ఓ నిర్మానుష్య ప్రాంతంలో చెట్టుకు పూరన్ సింగ్ మృతదేహం వేళ్లాడుతూ కనిపించింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూరన్ సింగ్ తనకు ఉద్యోగం దొరకడం లేదని, కుటుంబ సభ్యులకు తిండి కూడా పెట్టలేకపోతున్నాననే ఆవేదనతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
అయితే దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుగా పూరన్ సింగ్ చనిపోయిన విషయం తెలుసుకున్న స్థానిక పౌర సరఫరాల అధికారులు ఆ కుటుంబానికి రేషన్ సరుకులు ఇచ్చారు. అదేదో ముందే చేసి ఉంటే అనవసరంగా ఓ నిండు ప్రాణం బలి కాకుండా ఆపేవారం కదా. ఏది ఏమైనా.. పూరన్ సింగ్ ఉసురు ఆ అధికారులకు, ఆ ప్రాంత నేతలకు తగలకుండా ఉండదు. అయితే ఒక్క పూరన్ సింగ్ మాత్రమే కాదు.. దేశంలో ఇంకా అనేక మంది ఇలాగే ఆకలి చావులకు గురవుతున్నారు. రంగరాజన్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఈ ఏడాది మన దేశంలో 130 కోట్ల జనాభాలో ఇప్పటికీ.. ఇంకా.. 4.60 కోట్ల మంది అత్యంత నిరుపేదలు ఉన్నారని, వారిలో సగటున 5 మందిలో ఒకరు ఇప్పటికీ సరైన ఆహారం లేక చనిపోతున్నారని వెల్లడైంది. అవును మరి.. మన దేశంలో పాలకులకు, ప్రతిపక్షాలకు ఒకర్నొకరు దూషించుకోవడమే పని కదా.. ఇంక ప్రజల సమస్యలను వారు ఎలా పట్టించుకుంటారు చెప్పండి.. వారంతా దూషణ పర్వాల్లోనే బిజీ బిజీగా రోజులు గడిపేస్తున్నారు. అలాంటప్పుడు ప్రజల కష్టాలు తీరుతాయని ఆశించడం.. అడియాశే అవుతుంది..!