పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన ఫోన్ పోతే ఎలా ఉంటుంది ? ఎవరికైనా బాధగానే అనిపిస్తుంది. అయ్యో.. అంత ఖరీదుతో కొన్న ఫోన్ పోయిందే, కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సింది.. అని ఫోన్‌లను పోగొట్టుకునే ఎవరికైనా అనిపిస్తుంది. అయితే అలా పోయిన ఫోన్ దొరికితే.. అలాంటి వారిని లక్కీ అనే చెప్పవచ్చు. తైవాన్‌లోనూ ఓ వ్యక్తికి సరిగ్గా ఇలాగే జరిగింది. లక్ ఉంది కాబట్టి ఫోన్ చెరువులో పడ్డా దొరికింది.
తైవాన్‌లో ఏడాది కిందట చెన్ అనే వ్యక్తి చెరువులో బోటింగ్ చేస్తూ తన ఐఫోన్ 11 ప్రొ మ్యాక్స్‌ను అందులో పారేసుకున్నాడు. అయితే ప్రస్తుతం అక్కడ కరువు విపరీతంగా ఉంది. దీంతో చెరువులు, చిన్న చిన్న కుంటలు అన్నీ ఎండిపోతున్నాయి. చెన్ ఫోన్ పారేసుకున్న చెరువు కూడా ఎండిపోయింది. దీంతో అతని ఫోన్ బురదలో ఇంకో వ్యక్తికి దొరికింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి చెన్ స్నేహితుడు కావడంతో అతని ఫోన్‌ను అతనికి తెచ్చి ఇచ్చాడు.
అయితే ఆ ఫోన్‌ను బాగా శుభ్రం చేసిన చెన్ ఆది తడి ఆరిపోయే వరకు వేచి చూశాడు. తరువాత దానికి చార్జింగ్ పెట్టాడు. దీంతో అది ఎప్పటిలా పనిచేయడం ప్రారంభించింది. అలా పోయిన ఫోన్ దొరకడం, అది మళ్లీ పనిచేస్తుండడం అతని అదృష్టం అనే చెప్పవచ్చు.