బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయడం చాలా దేశంలో నిషేధం. అలా చేసిన వారికి అక్కడ కఠినమైన శిక్షలు విధిస్తారు. కానీ మన దేశంలో అలా కాదు. శుభ్రత పాటించాలని, మరుగుదొడ్లను ఉపయోగించాలని ఎంత మొత్తుకున్నా కొందరు వినరు. అయితే ఈ తరహాలోనే ఓ వ్యక్తి రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేసేందుకు తన బీఎండబ్ల్యూ కారు ఆపాడు. కానీ అంతలోనే ఆ కారును ఎవరో చోరీ చేశారు. ఈ సంఘటన నోయిడాలో చోటు చేసుకుంది.
నోయిడాకు చెందిన స్టాక్ బ్రోకర్ రిషబ్ అరోరా ఓ పార్టీకి హాజరై అక్కడ పీకలదాకా మద్యం సేవించాడు. అనంతరం తన బావకు చెందిన బీఎండబ్ల్యూ కారులో ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యలో మూత్రం రావడంతో కారును రోడ్డు పక్కన ఆపి పని కానిచ్చేద్దామనుకున్నాడు. అయితే కారు నుంచి దిగి రోడ్డు పక్కకు వెళ్లగానే వెనుక నుంచి కొందరు వచ్చి అతనికి గన్ చూపించి బెదిరించి కారును దొంగిలించుకుపోయారు. దీంతో రిషబ్ పోలీసులకు సమాచారం అందించాడు.
కాగా రిషబ్ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆ కారును వెదికే పనిలో పడ్డారు. అయితే అది ఎవరో కావాలనే చేసిన పని అని పోలీసులు భావిస్తున్నారు. ఇక ఆ కారుపై ఇంకా రూ.40 లక్షల లోన్ పెండింగ్‌లో ఉందని, తనకు ఆ కారును వెంటనే తెచ్చి పెట్టాలని రిషబ్ వేడుకుంటున్నాడు. అయితే పోలీసులు కారును వెదికి తేవడంతోపాటు మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నందున రిషబ్‌పై కూడా కేసు నమోదు చేస్తామని తెలిపారు. అంతే మరి.. కొన్ని కొన్ని సార్లు అలాగే జరుగుతుంది. అందుకు ఎవరూ ఏమీ చేయలేరు..!