ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆగ్రహంగా ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని పరిణామాలపై కేంద్ర పెద్దలు ఆగ్రహంగా ఉన్నారని మీడియా కూడా అంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడానికి కారణం ఏంటీ అనేది కూడా స్పష్టంగా తెలియడం లేదు.
ఈ నేపధ్యంలోనే జగన్ ని ఢిల్లీ పెద్దలను కలిసి కేంద్రానికి వివరించాలని భావిస్తున్నారట. అసలు రాష్ట్రంలో జరిగిన పరిణామాలకు సంబంధించి నేరుగా ఆయన ద్వారానే తెలుసుకునే ప్రయత్నాలు కేంద్రం చేస్తుంది అంటున్నారు. బిజెపి ఎంపీలు జగన్ పై ఫిర్యాదు చేసారు. కొన్ని వీడియో లను కూడా వారికి చూపించారు. దీనితో రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆయన కేంద్ర పెద్దలకు వివరించే అవకాశం ఉందని సమాచారం. అలాగే ఎన్నికలను వాయిదా వేయవద్దు అని ఆయన కోరినట్టు తెలుస్తుంది. ఇప్పటికే విజయసాయి రెడ్డి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారని అంటున్నారు.
త్వరలోనే జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా ని కలిసి వివరించే ప్రయత్నం చేసే అవకాశం ఉందని అంటున్నారు. రాష్ట్రంలో కరోనా లేదని, అసలు ఆ ప్రభావం లేదని, కాబట్టి ఎన్నికల ప్రక్రియను పూర్తి చెయ్యాలని ఆయన కోరే అవకాశం ఉందని అంటున్నారు. బుధవారం లేదా గురువారం జగన్ ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉందని సమాచారం. దీనిపై రేపు ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కాగా ఎన్నికలను వాయిదా వేయడంపై వైసీపీ సుప్రీం కోర్ట్ కి వెళ్ళిన సంగతి విదితమే.