యాపిల్ కంపెనీకి చెందిన ఎయిర్‌పాడ్స్ ఎంత ఖరీదు ఉంటాయో అందరికీ తెలిసిందే. అందువల్ల వాటిని సాధారణ వినియోగదారులు వాడలేరు. అయితే ఖరీదు ఉన్నప్పటికీ అవి అద్భుతంగా పనిచేస్తాయి. అత్యంత నాణ్యమైన శబ్దాన్ని అందిస్తాయి. ఈ క్రమంలోనే కొందరు వాటిని రాత్రిపూట అలాగే చెవులకు ధరించి సంగీతం వింటూ నిద్రపోతుంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే విషయం తెలిస్తే ఇకపై ఎవరూ అలా చేయరు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?
అమెరికాలోని మసాచుసెట్స్‌కు చెందిన 38 ఏళ్ల బ్రాడ్ గాథియర్ అనే వ్యక్తి రాత్రిపూట యాపిల్ ఎయిర్‌పాడ్స్ ధరించి పాటలు వింటూ నిద్రించాడు. తరువాత రోజు ఉదయాన్నే అతనికి ఛాతిలో అసౌకర్యంగా అనిపించింది. గొంతులో ఏదో అడ్డం పడిందని అనుకున్నాడు. కానీ ముందు రోజు బర్త్ డే కావడం వల్ల తిన్న ఆహారం కారణంగా అలా అవుతుందేమోనని బాగా నీళ్లు తాగాడు. దీంతో సమస్య తగ్గింది. అయితే తన యాపిల్ ఎయిర్ పాడ్స్ లో ఒకటి కనిపించడం లేదని తెలిసి ఇల్లంతా వెదికాడు. అయినా దొరకలేదు. చివరకు ఫోన్‌తో వాటిని కనెక్ట్ చేసి చూడగా ఒక ఎయిర్ పాడ్ తన శరీరంలో ఉందని తేలింది.
దీంతో అతను వెంటనే హాస్పిటల్‌కు వెళ్లగా వైద్యులు అతనికి ఎక్స్ రే తీసి చూశారు. ఈ క్రమంలో ఒక ఎయిర్‌పాడ్ అతని జీర్ణాశయానికి వెళ్లే నాళంలో పై భాగంలో ఉన్నట్లు కనిపించింది. దీంతో డాక్టర్లు చాలా సులభంగా ఆ ఎయిర్‌పాడ్‌ను పెద్ద రిస్క్ లేకుండానే బయటకు తీశారు. అయితే అది పూర్తిగా కిందకు పోకపోవడం వల్ల ప్రమాదం తప్పిందని, అందువల్లే సింపుల్‌గా దాన్ని బయటకు తీయగలిగామని, లేదంటే మేజర్ సర్జరీ చేసి ఉండాల్సి వచ్చేదని వైద్యులు తెలిపారు. ఇక బయటకు తీసిన ఆ ఎయిర్‌పాడ్ మళ్లీ ఎప్పటిలాగే పనిచేస్తుందని బ్రాడ్ తెలిపాడు. అవును.. అతని అదృష్టం బాగుంది కాబట్టే సేఫ్‌గా బయట పడ్డాడు. ఎయిర్‌పాడ్ కూడా పనిచేస్తోంది. లేదంటే ప్రాణాంతక పరిస్థితులు వచ్చి ఉండేవి..!