ఇండియా, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌ను ఆపేయండి.. లేదంటే ఆత్మ‌బ‌లిదానం చేసుకుంటాన‌ని వ్య‌క్తి హెచ్చ‌రిక‌..

-

భార‌త్ ఇంగ్లండ్‌ల మ‌ధ్య టీ20 సిరీస్ జ‌రుగుతున్న విష‌యం విదిత‌మే. తొలి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలుపొంద‌గా రెండో టీ20 మ్యాచ్‌లో భార‌త్ గెలిచింది. దీంతో సిరీస్ 1-1తో స‌మంగా ఉంది. ఈ క్ర‌మంలో మూడో టీ20 మ్యాచ్‌ను మంగ‌ళ‌వారం మ‌ళ్లీ అహ్మ‌దాబాద్ స్టేడియంలో ఆడ‌నున్నారు. అయితే గుజ‌రాత్‌లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ‌ని, క‌నుక ఆ టీ20 సిరీస్‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఓ వ్య‌క్తి పోలీసుల‌ను హెచ్చ‌రించాడు.

అహ్మ‌దాబాద్‌కు చెందిన పంక‌జ్ ప‌టేల్ మార్చి 12వ తేదీన అక్క‌డి పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ కేవీ ప‌టేల్‌కు కాల్ చేసి.. ఇండియా, ఇంగ్లండ్ ల మ‌ధ్య కొన‌సాగుతున్న టీ20 సిరీస్‌ను ర‌ద్దు చేయాల‌ని లేదంటే ఆత్మ బ‌లిదానం చేసుకుంటాన‌ని హెచ్చ‌రించాడు. దీంతో కేవీ ప‌టేల్ వెంట‌నే స‌మీపంలో ఉన్న చాంద్‌ఖెడా పోలీసుల‌కు పంక‌జ్ ప‌టేల్ ఫోన్ నంబ‌ర్‌ను ఇచ్చి అత‌ని వివ‌రాల‌ను తెలుసుకోమ‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో పోలీసులు పంక‌జ్ వివ‌రాల‌ను సేక‌రించారు. అత‌నిపై అక్క‌డి పోలీస్ స్టేష‌న్‌లో పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేసి అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు.

కాగా భార‌త్‌, ఇంగ్లండ్‌ల మ‌ధ్య ఇటీవ‌ల ముగిసిన టెస్టు మ్యాచ్ సిరీస్‌కు స్వ‌ల్ప సంఖ్య‌లో ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించారు. కానీ టీ20 సిరీస్ కు మాత్రం ప్రేక్ష‌కులు అధికంగా వ‌స్తున్నారు. ఆదివారం ఒక్క‌రోజే అక్క‌డ 800కు పైగా కోవిడ్ కేసులు న‌మోదు కాగా.. నిత్యం నమోదు అవుతున్న క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే త్వ‌ర‌లో జ‌రిగే ఇండియా, ఇంగ్లండ్ వ‌న్డే సిరీస్‌తోపాటు ఐపీఎల్ మ్యాచ్‌ల‌కు కూడా ప్రేక్ష‌కుల‌ను స్టేడియాల‌లోకి అనుమతించ‌బోవ‌డం లేద‌ని బీసీసీఐ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version