మూడ్రోజుల పర్యటనలో భాగంగా.. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ఇవాళ సాయంత్రం రాష్ట్రానికి రానున్న ఠాక్రే .. హాత్ సే హాత్ జోడో అభియాన్ పర్యవేక్షించేందుకు ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు గాంధీభవన్‌లో నేతలతో సమీక్ష చేయనున్నారు. తొలి రోజు ప్రచార కమిటీ, ఎన్నికల నిర్వహణ కమిటీ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌లతో భేటీ అవుతారు. ఆ తర్వాత రాత్రి 8 నుంచి 9 గంటల వరకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
రెండో రోజు హాత్ సే హాత్ జోడో అభియాన్‌పై పీసీసీ కార్యవర్గ సభ్యులతో సమావేశం అవుతారు. అనంతరం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు.. ఆ తర్వాత ఎన్ఎస్యూఐ నేతలతో సమాలోచనలు జరుపుతారు. సేవాదళ్ నాయకులతో, యువజన కాంగ్రెస్ నేతలు, ఐఎన్టీయూసీ శ్రేణులతో ఠాక్రే భేటీ కానున్నారు. మూడోరోజు ఆదివారం నాడు పార్టీలో సఖ్యత కోసం సీనియర్ నేతలతో ప్రత్యేక మంతనాలు జరుపుతారు. బిజినేపల్లిలో జరిగే దళిత గిరిజన ఆత్మగౌరవ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత శంషాబాద్ నుంచి పూణెకు పయనం అవుతారు.