తెలంగాణలో ఇప్పుడు రాజకీయాలన్నీ ఈటల రాజేందర్, హుజూరాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. ఇక ఈటల రాజేందర్ మొదట్లో తాను ఆత్మగౌరవ పోరాటం చేస్తానని, ఒంటరిగానే బరిలో దిగుతానని చెప్తూ వచ్చారు. కానీ అనూహ్యంగా ఆయన బీజేపీలోకి వెళ్లారు. దీంతో తెలంగాణ మావోయిస్టు పార్టీ ఆయనపై భగ్గుమంటోంది. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ లేఖ విడుదల చేసింది.
ప్రస్తుతం ఈటలపై తెలంగాణ మావోయిస్టు పార్టీ ఘాటుగా విడుదల చేసిన లేఖ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇందుకు కారణం ఈటల రాజేందర్ మొదటి నుంచి కమ్యూనిస్టు భావాలతో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. అలాంటి నేత ఇప్పుడు బీజేపీలో చేరడంతో మావోయిస్టు పార్టీ భగ్గుమంటోంది.
ఈటల తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే టైమ్‌లో ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాను ఆత్మగౌరవం కోసం పోరాడుతానని చెప్పారు. ఈయితే ఈ ప్రకటనను తీవ్రంగా ఖండించింది మావోయిస్టు పార్టీ. ఈటల రాజేందర్ ఆత్మగౌరవం కోసం పోరాడుతానని, ఇప్పుడు దానికి పూర్తి విరుద్దమైన హిందూత్వ ఎజెండాతో పనిచేసే బీజేపీలో చేరడం స్వలాభం కోసమేనంటూ మండిపడ్డారు మావోయిస్టు పార్టీ అగ్రనేతలు.