లొంగిపోయిన మావోయిస్టు కీల‌కనేత శార‌ద‌క్క‌..!

మావోయిస్టు కీల‌క నేత శార‌ద‌క్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. గ‌త కొంత కాలంగా బ‌జ్జ‌ర స‌మ్మ‌క్క అలియాస్ శార‌ద‌క్క అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తుంది. దాంతో శార‌ద‌క్క శుక్ర‌వారం ఉద‌యం డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. శారదక్క మహబూబాద్‌ జిల్లాలోని గంగారం వాసి కాగా 1994లో పీపుల్స్ వార్ పార్టీకి ఆక‌ర్షితులై అందులో చేరిపోయారు.

అప్ప‌టి నుండి శార‌ద‌క్క అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గతంలో శార‌ద‌క్క శ‌బ‌రి-చ‌ర్ల ప్రాంతానికి కార్య‌ద‌ర్శిగా ఉండ‌గా ప్ర‌స్తుతం జిల్లా క‌మిటీ స‌భ్యురాలిగా ఉన్నారు. ఇదిలా ఉండ‌గా ఇటీవ‌లే శార‌ద‌క్క భ‌ర్త హ‌రిభూష‌న్ క‌రోనాతో మ‌ర‌ణించారు. అప్ప‌టి నుండే శార‌ద‌క్క కూడా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. దాంతో కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న చెందారు. కాగా తాజాగా ఈ రోజు శార‌ద‌క్క లొంగిపోయారు.