ములుగు జిల్లాలో వెంకటాపురం మండలం అలుబాక గ్రామానికి చెందిన TRS నాయకుడు మాడురి భీమేశ్వర్ రావును మావోయిస్టులు హతమార్చిన సంగతి తెలిసిందే. ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిని బయటకు పిలిచి కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపారు మావోయిస్టులు. అంతే కాదు అధికార పార్టీలో కనసాగుతూ అమాయకప్రజలను దోచుకుంటున్నాడని అక్కడ లేఖ రాసి అందులో పేర్కొన్నారు మావోయిస్టులు. టీఆర్ఎస్ – బీజేపీ నాయకులు వెంటనే వారి పదవులు రాజీనామాలు చేయాలని, లేకపోతే వారికి కూడా ఇదే గతి పట్టుద్దని హెచ్చరికలు కూడా చేశారు.
ఐదురోజుల క్రితమే వెంకటాపురంలో డీజీపీ,సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారుల పర్యటన సాగగా, పోలీసులకు సవాల్ విసిరేలా మావోయిస్టులు ఘటనా స్థలంలో ఈ లేఖ వదిలి వెళ్లారు. భీమేశ్వరరావు అధికారపార్టీని అడ్డుపెట్టుకుని ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారని…ప్రశ్నిస్తే పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారని ఆరోపణలు చేశారు. అయితే ఘటనా స్థలంలో ఓకత్తి,రెండు బుల్లెట్లు లభ్యం అయ్యాయి. కానీ మావోయిస్టుల అసలు టార్గెట్ మిస్ అయిందని అంటున్నారు. నిజానికి టీఆర్ఎస్ వెంకటాపురం మండల అధ్యక్షుడు గంప రాంబాబును మట్టుబెట్టేందుకు మావోయిస్టులు వచ్చినట్టు చెబుతున్నారు. అయితే పని నిమిత్తం ఖమ్మం వెళ్లిన రాంబాబు నిన్న రాత్రి ఇంట్లో లేకపోవడంతో ఆయన ప్లేస్ లో మరో టీఆర్ఎస్ నేత భీమేశ్వరరావును హతమార్చినట్టు తెలుస్తోంది.