తెలుగు మాసాలలో తొమ్మిదవ మాసమైన మార్గశిర మాసం శ్రేష్టమైన మాసం. మార్గశిర పౌర్ణమి నాడు మృగశిరా నక్షత్రం ఉండటం వలన ఈ మాసానికి మార్గశిర మాసం అనే పేరు వచ్చింది. కార్తీకం శివునికి ప్రీతికరమైతే, మార్గశిర మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైనది. ఆ శ్రీమన్నారాయణుడే స్వయంగా మార్గశిరం అంటే తానే అని గీతలో ప్రభోధించాడు.
మార్గశిరమాసం అనగా మృగశిరా నక్షత్రం తో కూడిన పూర్ణిమ కలది, కనక మార్గ శిరమాసం ప్రవేశిస్తోంది. దీనినే మార్గశీర్షమాసం అని కూడా అంటారు. చలి ప్రారంభం అయ్యేకాలం. హరికి ఇష్టమైన మాసం. హరిపదం చేరడానికి మొదటగా చెప్పే మాసమని కూడా అంటారు. అనగా ఉపాసనకాలంలో ఉత్తమమైనదిగా చెబుతారు. శ్రీకృష్ణభగవానుడు గీతలో ఉత్తమమైనవి అనగా, “పక్షులలో గరుత్మంతుడు, మృగములలో సింహము,మాసములలో మార్గశిరమాసము, వేదములలో సామవేదము నేనే” అని చెబుతాడు. హరిని సేవించడం ఈ మాసం ముఖ్య లక్షణం. ఈమాసంలో శ్రీవిష్ణు ఆరాధన, సహస్రనామాలను పారాయణం చేయడం, పాశురాలను చదవడం, పేదలకు, బ్రాహ్మణులకు దానాలు ధర్మాలు చేయడం అత్యంత శ్రేష్టం.