ఛత్తీస్ గడ్ లో తాజాగా మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య మంగళవారం భీకరమైన ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో దాదాపు 11 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. పరస్పర కాల్పుల్లో కొందరు మావోయిస్టులు, జవాన్లు గాయపడ్డట్లు తెలుస్తోంది. కొహకమెట్ పోలీస్ స్టేసన్ పరిధిలోని ధనంది-కుర్రేవాయ మధ్య అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కొహకమెట్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు దాదాపు 1400 మందికి పైగా భద్రతా దళాలు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈ మేరకు కూంబింగ్ నిర్వహిస్తుండగా భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం కాల్పులు చేసుకున్నారు. ఈ హోరా హోరీ కాల్పుల్లో 11 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరి కొందరు పారిపోవడంతో భద్రతా దళాలు దండకార్యణంలో జల్లెడ పడుతున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది.