దేశ రాజధాని ఢిల్లీలో నిన్న రాత్రి ఘోర విషాదం చోటుచేసుకున్నది. ఢిల్లీలోని ముండ్కా ఏరియాలోని ఓ నాలుగంతస్తుల వాణిజ్య భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 27 మంది ఆహుతి కాగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. రెస్క్యూ ఆపరేషన్ శుక్రవారం రాత్రి వరకు కొనసాగుతోంది. విషయం తెలిసే సమయానికి భవనంలో ఇంకా కొంత మంది చిక్కుకొని ఉండొచ్చని భావిస్తున్న నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
సాయంత్రం సమయంలో జరిగిన ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. 30 అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. కిటికీల అద్దాలు పగులకొట్టి లోపల చిక్కుకున్న వారిలో కొంత మందిని రక్షించారు. క్షతగాత్రులను దవాఖానలకు తరలించారు. ప్రమాదం జరిగిన ఈ భవనంలో పలు కంపెనీల కార్యాలయాలు ఉన్నాయి. సీసీటీవీ కెమెరాలు, రూటర్లు తయారు చేసే కంపెనీ ఉండే మొదటి అంతస్తులో రేగిన మంటలు మిగతా ఫ్లోర్లకు కూడా వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ ఆవిరించింది. కంపెనీ యజమానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రమాదానికి గల కారణంపై ఇంకా స్పష్టత రాలేదు.