ప్రస్తుతం దేశవ్యాప్తంగా వక్ఫ్ చట్టం గురించే చర్చ జరుగుతోంది. దీన్ని చాలా రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇటీవలే బంగాల్ సీఎం మమతా బెనర్జీ తమ రాష్ట్రంలో ఈ చట్టం అమలు చేయబోమని స్పష్టం చేశారు. ఇక తాజాగా ఈ చట్టంపై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) అధినేత్రి మాయావతి స్పందించారు. ఈ చట్టంలోని నిబంధనలను పునఃపరిశీలించి, ప్రస్తుతానికి దానిని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డ్‌లో చేర్చడానికి వీలు కల్పిస్తూ నిబంధనలు మార్చడం ఏమాత్రం మంచిది కాదని మాయావతి అన్నారు. ముస్లిమేతరులను రాష్ట్ర వక్ఫ్ బోర్డులో భాగం కావడానికి అనుమతించే నిబంధన తప్పుగా కనిపిస్తోందని తెలిపారు. ముస్లిం సమాజం దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోదని.. కేంద్ర సర్కార్ ఇలాంటి వివాదాస్పద నిబంధనలు సవరించాలని కోరారు. ఇందుకోసం వక్ఫ్ చట్టాన్ని పునఃపరిశీలించి వాటిని నిలిపేస్తే మంచిదని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
ఇక వక్ఫ్ సవరణ చట్టంపై ఏప్రిల్ 3న లోక్‌సభలో ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ బిల్లుకు అనుకూలంగా 288 మంది సభ్యులు ఓటేయగా.. వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేయడంతో లోక్ సభలో చాలా సులువుగా ఈ బిల్ల్ పాస్ అయిపోయింది.