అమెరికా లో ఆరు టీం ల మధ్యన జరుగుతున్న మొదటి సీజన్ మేజర్ లీగ్ క్రికెట్ లో క్రికెట్ అభిమానులకు అసలైన మజాను అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఉదయం లాస్స్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ మరియు సాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన యునికార్న్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ లో యునికార్న్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఇంతటి స్కోర్ రావడంలో ఓపెనర్ వెడ్ (78) స్టయినిస్ (37) మరియు అండెర్సన్ (39) లు కీలక పాత్ర పోషించారు. కాగా భారీ టార్గెట్ ను చేధించడానికి బరిలోకి దిగిన నైట్ రైడర్స్ కేవలం మొదటి 5 ఓవర్ లలోనే మ్యాచ్ లో ఉంది, ఆ తర్వాత జాసన్ రాయ్ అవుట్ అవ్వడంతో మ్యాచ్ పై ఆశలు పోయాయి. ఇతను కేవలం 21 బంతుల్లోనే 4 ఫోర్లు మరియు 4 సిక్సులు సహాయంతో 45 పరుగులు చేశాడు. అనంతరం అందరూ పెవిలియన్ కు వరుసగా క్యూ కట్టడంతో గెలుపు సాధ్యం కాలేదు.
ఆఖర్లో రస్సెల్ (42) మరియు నరైన్ (28) లు మెరుపులు మెరిపించినా ఉపయోగం లేకుండా పోయింది. ఈ మ్యాచ్ లో నైట్ రైడర్స్ జట్టు 21 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. ఈ ఓటమితో వరుసగా మూడు మ్యాచ్ లు కోల్పోయి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది. ఇక ప్లే ఆఫ్ ఆశలు నైట్ రైడర్స్ కు లేనట్లే.