ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన శ్రీ మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర తేదీలు ఖరారు అయ్యాయి. మహాజాతర తేదీలను గిరిజన పూజారులు ఖరారు చేశారు . వచ్చే ఏడాది (2022),ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు మేడారం సమ్మక్క – సారలమ్మను జాతరను నిర్వహించనున్నారు. ఆదివాసీ గిరిజన సాంప్రదాయ ప్రకారం మాఘ శుద్ధ పౌర్ణమి రోజున ఈ జాతరను నిర్వహిస్తారు.
ఆదివాసీ గిరిజన దైవాలు సమ్మక్క, సారలమ్మలు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో కొలువుదీరిన విషయం తెల్సిందే. ములుగు జిల్లా కేంద్రం నుండి ఇక్కడికి 44 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ మహా జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తుంటారు.
కాగా ప్రతి రెండేళ్లకొక సారి నాలుగు రోజుల పాటు ఎంతో వైభవంగా సాగే ఈ ఉత్సవానికి కోటి మందికిపైగా భక్తులు తరలివస్తారు. ఈ పండుగ తొలి రోజున సారలమ్మ, పగిదిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటుంది. రెండో రోజున సమ్మక్క గద్దెకు చేరుకుంటుంది. మూడో రోజున భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.చివరిదైన నాలుగో రోజున దేవతల వన ప్రవేశంతో పండుగ ముగుస్తుంది. కాగా 2014లో తెలంగాణ ప్రభుత్వం ఈ పండగను రాష్ట్ర పండుగగా గుర్తించింది.