ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క,సారలమ్మ జాతర ముగిసింది.చివరి పూజల అనంతరం వన దేవతలు సమ్మక్క-సారలమ్మలు తిరిగి వన ప్రవేశం చేశారు. సమ్మక్కను చిలకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లి ఆలయాలకు తరలించారు. పునుగొండ్లకు పగిడిద్దరాజు, కొండాయికి గోవిందరాజు వెళ్లనున్నారు. మేడారం జాతర చివరి అంకానికి చేరడంతో జనసంద్రమైంది. కాగా, మరోవైపు మేడారం జాతరకి కనీవినీ ఎరుగని రీతిలో ఈ సారి భక్తులు పాల్గొన్నారు. ఒకప్పుడు గిరిజనులు మాత్రమే జాతరను జరుపుకునేవారు. కాని ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ విశేషంగా జరుపుకుంటున్నారు.
నాలుగు రోజుల్లో కోటి నలభై లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. శనివారం రాత్రి వరకు మరింత పెరిగే అవకాశం ఉందని మంత్రి సీతక్క తెలిపారు. నేటితో మేడారం జాతర ముగియ నుండడంతో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. తక్కువ సమయంలోనే జాతరకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.