సెప్టెంబర్ 1 నుంచి సోషల్ మీడియాలో ఒకటే చర్చ. రోహిత్ శర్మ, గంగూలీ, కార్తి, రష్మిక, దీపికా పదుకొణె ఇంతమంది కలిసి ఓకే స్క్రీన్ నటిస్తున్నారా? అసలేంటి ఈ మెగా బ్లాక్ బస్టర్ ట్రైలర్? అది సినిమానా లేక సిరీసా అంటూ తెగ మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడీ సస్పెన్స్ ఏంటో ముందే తెలిసిపోయింది.
గతంలో ఎప్పుడూ వినని నిర్మాణ సంస్థ ఓసీమ్ నుంచి తామే ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లుగా ఉన్న మెగా బ్లాక్ బస్టర్ ట్రైలర్ అంటూ ఓ పోస్ట్‌ను ఈ స్టార్స్ అంతా షేర్ చేశారు. అప్పటినుంచి నెటిజన్లందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. అది సినిమానా, వెబ్ సిరీసా అందరూ కలిసి ఎలా నటిస్తున్నారంటూ తెగ చర్చించుకుంటున్నారు. ఇప్పుడు దాని రహస్యం బయటపడింది. అదీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సోషల్‌మీడియా టీమ్ చేసిన తప్పిదం కారణంగా.
మెగా బ్లాక్ బస్టర్ అనేది ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ‘మీషో’ ప్రమోషనల్ స్టంట్ అని తేలిపోయింది. వీరంతా దానికోసమే తమ పోస్టర్లను పంచుకున్నారు. అయితే గంగూలీ చేసిన తప్పిదం కారణంగా అదేంటో తెలిసిపోయింది. ప్రమోషనల్ స్టంట్‌లో పాల్గొన్న ప్రముఖులు తమ మీషో పేరును బయటపెట్టకూడదంటూ.. కేవలం తమ ఫొటో, ఇంకా బ్లక్బాస్టర్ అనే పేరు వచ్చేలా మాత్రమే పోస్టర్ చేయాలంటూ ఓ మెసేజ్‌ను ఈ స్టార్స్‌కు షేర్ చేసింది. మీషో బ్రాండ్ లేదా హాష్ ట్యాగ్ ఎక్కడా ప్రస్తావించకూడదని చెప్పింది. అయితే గంగూలీ టీమ్ మాత్రం ఆ మెసేజ్‌తో సహా బ్లాక్ బస్టర్ పోస్టర్‌ను యథాతథంగా పోస్ట్ చేసింది. కానీ వెంటనే డిలీట్ చేసింది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. కొంతమంది నెటిజన్లు ముందు షేర్ చేసిన దాన్ని స్క్రీన్ షాట్ తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. ప్రస్తుతం అవి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.