కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించడం ప్రజల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. “తల్లి దుర్గాభవాని కొలువైన పుణ్యభూమిలో మిమ్మల్ని కలవడం నాకు ఆనందంగా ఉంది” అంటూ మోదీ సంభాషణ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ 60 వేల కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు కాదని, ఇవే వికసిత్ భారత్‌కు, అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్‌కు బలమైన పునాదులు అని పేర్కొన్నారు. అమరావతిని భారతదేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దాలన్న సంకల్పాన్ని కేంద్ర ప్రభుత్వం కలిగి ఉందని వెల్లడించారు.
అమరావతి కేవలం నగరం కాదు, ఒక శక్తి అని ప్రధాని స్పష్టం చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్‌ను ఆధునిక రాష్ట్రంగా తీర్చిదిద్దే శక్తిగా ఎదగనుందని అన్నారు. అమరావతిని ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, విద్య, వైద్యం, పరిశ్రమలు వంటి అన్ని రంగాలకు కేంద్రంగా అభివృద్ధి చేస్తామని వివరించారు. హరితశక్తి, స్వచ్ఛ పరిశ్రమల అభివృద్ధికి కేంద్రం విశేషంగా కృషి చేస్తుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. వారి నాయకత్వాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. “చంద్రబాబు గారు టెక్నాలజీతో ముందడుగు వేశారు. ఐటీ అభివృద్ధిలో ఆయనకు సమానులు లేరు. ఆయన చేసే పనుల వేగాన్ని దేశం చూసింది. ఎంత పెద్ద ప్రాజెక్టైనా త్వరగా పూర్తిచేయగల నేత చంద్రబాబే,” అని మోదీ కొనియాడారు.