ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా,భీమవరం నియోజకవర్గం,పెదఅమిరంలో జరిగే ఆజాదీ కా అమృతోత్సవ్, అల్లూరి జయంత్యు త్సవాల్లో పాల్గొనాలని కోరుతూ జనసేనాని పవన్ కల్యాణ్ కు ఆహ్వాన కమిటీ తరఫున పిలుపు వెళ్లింది. అదేవిధంగా ఇదే వేదికపై మెగాస్టార్ చిరంజీవి కూడా ఆశీనులు కానున్నారు. ఆయన కూడా అల్లూరి స్ఫూర్తిని భావి తరాలకు చాటేందుకు ఇక్కడికి రానున్నారు.
ఒకేవేదికపై ఇద్దరు అగ్ర కథానాయకులు సందడి చేయనుండడంతో భీమవరంలో జన సంద్రం పోటెత్తనుంది. వాస్తవానికి చిరంజీవికి కన్నా పవన్-కే ఈ సభ అత్యంత కీలకం.ఆయన గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడి వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ నిరంతరం జన సైనికులతో తలపడుతూనే ఉన్నారు అన్న వార్తలు కూడా ఉన్నాయి. కనుక ఈ భీమవరం సభ అటు టీడీపీకే కాదు ఇటు జనసేనకూ అత్యంత ప్రతిష్టాత్మకం. కీలకం కూడా !
మరోవైపు వైసీపీ పెద్దలు కూడా ఈ సభకు హాజరుకానున్నారు. ప్రొటొకాల్ ప్రకారం సీఎం జగన్మోహన్ రెడ్డి తో పాటు ఇతర కీలక నాయకులు విచ్చేయనున్నారు. ఓ విధంగా అన్ని పార్టీల నాయకులనూ ఈ అల్లూరి జయంత్యుత్సవాల్లో భాగం చేయాలన్నది బీజేపీ వ్యూహంగా ఉంది.దేశానికి స్వాతంత్ర్యం తెచ్చే క్రమంలో పోరాడి ప్రాణాలు కోల్పోయిన అల్లూరి సేవలను మరోసారి స్మరణ చేసుకోవాల్సిన సిసలు తరుణం రానే వచ్చిందని, వారి గురించి భావి తరాలకు తెలియజెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని బీజేపీ నేతృత్వంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ వేడుకలకు సినీ గ్లామర్ ను యాడ్ చేయడం ద్వారా ఇంకొంత ఎక్కువ మందికి తాము చెప్పాలనుకుంటున్న సందేశం చేరువ అవుతుందని బీజేపీ భావిస్తోంది. ఆ క్రమంలో మెగాస్టార్ చిరంజీవికి ఈ వేడుకలకు సంబంధించి ఆహ్వానం వెళ్లిందని తెలుస్తోంది.