తల్లి ఒడి నుంచి మృత్యు ఒడికి.. పుంగనూరులో హృదయ విదారక ఘటన

చిత్తూరు: పుంగనూరులో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అరుదైన వ్యాధి సోకడంతో తన బిడ్డను చంపుకునేందుకు అనుమతివ్వాలని తల్లిదండ్రులు పుంగనూరు కోర్టులో మెర్సీ పిటిషన్ వేసేందుకు వెళ్లారు. అంతలోనే బాలుడు హర్షవర్థన్ చనిపోయారు. కోర్టుకు వెళ్తుండగా బాలుడు హర్షవర్ధన్ ఆటోలో కన్నుమూశారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న హర్షవర్దన్‌కు తల్లిదండ్రులు లక్షలు ఖర్చు పెట్టి చికిత్స చేయించారు. కానీ ఫలితంలేకుండా పోయింది. హర్షవర్థన్ పరిస్థితి మరీ దారుణంగా మారింది.

హర్షవర్దన్ నాలుగేళ్ల క్రితం కొండపై నుంచి కింద పడ్డారు. అప్పటి నుంచి హర్షవర్దన్ యూరిన్‌లో రక్తం వస్తోంది. ముక్కు, చెవుల్లో నుంచి కూడా రక్తం కారుతోంది. ఇందుకు ఖరీదైన వైద్యం చేస్తే తగ్గుందని డాక్టర్లు చెప్పారు. అయితే ఆర్థిక సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అటు ప్రభుత్వం కూడా ఎలాంటి సాయం చేయలేదు. దీంతో హర్షవర్థన్ ను చంపుకునేందుకు అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ వేయాలని తల్లిదండ్రులు అనుకున్నారు. పిటిషన్ వేసేందుకు కూడా డబ్బులు లేకపోవడంతో తమ బిడ్డను తీసుకుని సోమవారం కోర్టుకు వెళ్లారు. న్యాయమూర్తి లేకపోవడంతో మంగళవారం మరోసారి కోర్టుకు వెళ్లే సమయంలో బాలుడు హర్షవర్థన్ చనిపోయారు. మరో విషాదం ఏంటంటే సోమవారం రోజున హర్షవర్ధన్ తాత చనిపోయారు.