విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు ఎంతటి ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. మొబైల్ ఫోన్ల రంగంలో మైక్రోసాఫ్ట్ విఫలం అయినా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఆ రంగంలో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు కొత్త కొత్త విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లను మైక్రోసాఫ్ట్ ఇప్పటి వరకు రిలీజ్ చేస్తూ వచ్చింది. ఇక త్వరలోనే మరో కొత్త విండోస్ ఓఎస్‌ను ఆ సంస్థ విడుదల చేయనుంది.
జూన్ 24వ తేదీన మైక్రోసాఫ్ట్ తన నూతన విండోస్ ఓఎస్ అయిన విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ను లాంచ్ చేయనుంది. ప్రస్తుతం అనేక పీసీల్లో విండోస్ 10 ఓఎస్ అందుబాటులో ఉంది. కాగా కొత్త ఓఎస్‌కు చెందిన పలు స్క్రీన్ షాట్స్ ఇంటర్నెట్‌లో లీకయ్యాయి. వాటిని బట్టి చూస్తే విండోస్ 11 ఓఎస్‌లో పలు అద్భుతమైన ఫీచర్లను అందిస్తారని తెలుస్తోంది.
విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌లో సరికొత్త యూజర్ ఇంటర్ ఫేస్‌ను అందిస్తారని లీకైన స్క్రీన్ షాట్లను చూస్తే తెలుస్తుంది. అలాగే అందులో కొత్త స్టార్ట్ మెనూ, ఇతర సరికొత్త ఫీచర్లు, కొత్త వాల్ పేపర్లను అందిస్తారని తెలుస్తోంది.
కొత్త స్టార్ట్‌మెనూలో పిన్‌డ్ యాప్స్, రీసెంట్ ఫైల్స్, షట్ డౌన్, రీస్టార్ట్ ఆప్షన్లను గమనించవచ్చు. అలాగే విడ్జెట్స్ పేరిట నూతన ఫీచర్‌ను ఈ ఓఎస్‌లో అందిస్తారని తెలుస్తోంది. అయితే విండోస్ 7, 8.1 ఓఎస్‌లకు చెందిన జెన్యూన్ వెర్షన్లను వాడుతున్నవారు నేరుగా విండోస్ 11కు అప్‌గ్రేడ్ అయ్యేలా మైక్రోసాఫ్ట్ సదుపాయాన్ని అందివ్వనుందని తెలిసింది.