దేశంలో లాక్‌డౌన్ విధించడం కరోనా మహమ్మారి నుంచి మనలను మనం కాపాడుకోవడానికే అయినా.. దాని ప్రభావం వలస కూలీలపై తీవ్రంగా ఉన్నది. బతుకుదెరువు కోసం వచ్చిన చోట కూడు గూడు లేక, సొంతూర్లకు పోదామంటే రవాణ సౌకర్యాలు లేక వలస కూలీలు నరకయాతన అనుభవిస్తున్నారు.
ఢిల్లీలో వలస కూలీల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నిరాశ్రయుల కోసం ఢిల్లీ సర్కారు వసతి, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నా అవి అందరికీ అందే పరిస్థితి లేదు. దీంతో చేసేదేమీ లేక వలస కూలీలు వందల కిలోమటర్ల దూరంలో ఉన్న తమ స్వగ్రామాలకు కాలినడకనే బయలుదేరుతున్నారు. చంటి పిల్లలను చంకనేసుకుని, పసివాళ్లను నడిపిస్తూ బిస్కెట్లు మంచి నీళ్లతోనే కడుపు నింపుకుంటూ ఊరిబాట పడుతున్నారు.
లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పుడు ఇలా రోడ్లపైకి రావద్దు కదా అంటే.. ‘మావి రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు. రోజుల కొద్దీ పనిలేకపోతె ఏం తిని బతుకాలి?’ అని ప్రశ్నిస్తున్నారు. చేతిలో డబ్బులు లేక, తినడానికి తిండిలేక ఊరుగానీ ఊర్లో రోడ్ల మీద అనాథల్లా బతికే బదులు, సొంతూళ్లలో కుటుంబాలతో కలిసి చావడమే మేలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.