తెలంగాణలో అటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, సిట్ దూకుడు పెంచాయి. నేడు ఢిల్లీలో తెలంగాణ భవన్ నుంచి నేరుగా మంత్రి గంగుల కమలాకర్ సిబిఐ విచారణకు హాజరయ్యారు. మంత్రి గంగులతో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కూడా ఉన్నారు. ఢిల్లీలో అరెస్ట్ అయిన నకిలీ సిబిఐ అధికారి శ్రీనివాస్ కేసులో విచారణలో భాగంగా నేడు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎదుట మంత్రి గంగుల, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు.
ఈరోజు ఉదయాన్నే ఢిల్లీకి చేరుకున్న ఇద్దరు నేతలు తెలంగాణ భవన్ లో న్యాయవాదులతో చర్చించారు. అనంతరం సిబిఐ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా నేడు గంగుల, రవి చంద్రుల వాంగ్మూలం రికార్డు చేయనున్నారు సిబిఐ అధికారులు. అయితే గతంలో ఖమ్మంలో జరిగిన కాపు సంఘం సమావేశంలో శ్రీనివాస్ తో కలిసి ఫోటో దిగానని, దీని ఆధారంగానే సిబిఐ పిలిచినట్లు భావిస్తున్నామని అన్నారు మంత్రి గంగుల. తనకి శ్రీనివాస్ తో ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు.