తెలంగాణలో ఇప్పుడు అంతా ఈటల చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించి షాక్ ఇచ్చిన టీఆర్ ఎస్ నేతలు ఇప్పుడు వరుసగా విచారణలు జరిపిస్తున్నారు. అయితే ఇదంతా కుట్రేనని, తనమీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేస్తున్నారు.
ఇక మంత్రి పదవి తొలగించిన తర్వాత ఆయన హుజూరాబాద్ నియోజకవర్గానికి వెళ్లారు. నాయకులు, నేతలతో వరుస మీటింగులు పెడుతున్నారు. వారితో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.
ఇక ఇదిలా ఉండగా ఈటలకు టీఆర్ ఎస్ కేడర్‌ను దూరం చేయాలని అధిష్టానం భావించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు మంత్రి గంగుల కమలాకర్‌తో పావులు కదుపుతోంది. ఆయన గత రెండు రోజులుగా హుజూరాబాద్ లోని ఈటల కేడర్‌ను కరీంనగర్‌లోని తన క్యాంపు ఆఫీసుకు పిలిపించుకుని మంతనాలు జరపుతున్నారు. నామినేటెడ్ పదవులు, ఇతర పదవులు ఇస్తామని హామీలు ఇస్తున్నారు. ఎవరూ ఈటల వెంబడి తిరగొద్దని బుజ్జగిస్తున్నారు. తమ మాట వింటే భవిష్యత్ లో మంచి పొజీషన్లో ఉంటారని చెబుతూ తన వైపు తిప్పుకుంటున్నారు. దీంతో ఈటలను పార్టీ నుంచి బహిష్కరించేందుకు ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది.