మొన్నటి వరకు మౌనంగా ఉన్న గంగుల ఇప్పుడు ఈటలపై మాటల తూటాలు పేల్చుతున్నారు. ఎప్పుడైతే ఈటల రాజేందర్‌పై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయో అప్పటి నుంచి మంత్రి గంగుల కమలాకర్ వరుస ఆరోపణలు చేస్తున్నారు. ముందు నుంచే వీరిద్దరి మధ్య ఆధిపత్య పోటీ ఉండేది. కానీ ఎప్పుడూ బయటపడనివ్వలేదు. ఇప్పుడు అవకాశం రావడంతో గంగుల బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
ఈటల రాజేందర్‌ను బీసీ ముసుగు వేసుకున్న పెద్ద దొర అంటూ గంగుల కామెంట్లు చేయడం బట్టి చూస్తే.. టీఆర్ ఎస్‌లో తానే బలమైన బీసీ నేతగా ఎదగాలని కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో బలమైన బీసీ నేతగా ఈటలకు పేరుండేది. ఇప్పుడు ఆయనపై ఆరోపణలు రావడంతో ఆ ఇమేజ్ను తాను కొట్టేయాలని చూస్తున్నారు మంత్రి గంగుల.
ఇదే క్రమంలో ఈ రోజు కూడా ఈటలపై మాటల తూటాలు పేల్చారు. ఈటల టీఆర్ ఎస్ లో నీటి బొట్టు లాంటి వారని, అలాంటి వారు వెళ్లిపోయినా నష్టం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే ఈటలను పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు ఇన్‌డైరెక్ట్‌గా తెలిపారు. దీన్ని బట్టి ఆయన ఉమ్మడి జిల్లాలో కేటీఆర్ తర్వాత తన ఆధిపత్యాన్నే కొనసాగించాలని చూస్తున్నట్టు స్పష్టం అవుతోంది.