నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతున్నది. సోమవారం 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే తాజాగా.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. మునుగోడు ఉప ఎన్నిక.. అక్రమ కాంట్రాక్టులతో రాజగోపాల్ రెడ్డి సంపాదించిన ధన బలానికి, స్థానిక ప్రజా బలానికి మధ్య జరుగుతున్న పోటీ అని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. కాంట్రాక్టుల కోసమే మునుగోడు నియోజకవర్గాన్ని రాజగోపాల్ రెడ్డి పూర్తిగా నిర్లక్ష్యం చేశారని నిప్పులు చెరిగారు.
రాజగోపాల్ రెడ్డి ఒక అట్టర్ ప్లాప్ ఎమ్మెల్యే అని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మరోసారి హామీలు, ప్రలోభాలతో ప్రజలను మోసం చేసేందుకు రాజగోపాల్ రెడ్డి సిద్ధమయ్యాడని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. బీజేపీకి, రాజగోపాల్ రెడ్డికి ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పేందుకు మునుగోడు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. కేవలం రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసం వచ్చిన ఎన్నిక ఇది అని మంత్రి కేటీఆర్ తెలిపారు. కేవలం ఒక వ్యక్తి ధన దాహాం వలన వచ్చిన ఎన్నిక అని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు మంత్రి కేటీఆర్.