ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టులో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రజలకు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రాసెస్ జరుగుతుందని, తప్పనిసరిగా అందజేస్తామని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లో రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మువ్వా విజయబాబు బాధ్యతల స్వీకరణ కార్యక్రమములో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. రైతు నుంచి వచ్చిన నాయకుడు విజయబాబు అని, ఆయన తన పదవికి న్యాయం చేస్తాడనే నమ్మకం ఉన్నదనీ అన్నారు.
గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూనే ప్రజలకు అభివృద్ధిని అందజేస్తున్నామని వెల్లడించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రూ. 31వేల కోట్ల రుణ మాఫీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందనీ ఆయన అన్నారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా దేశంలో, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రుణ మాఫీ అర్హులందరికీ ప్రభుత్వం చేస్తుందనీ ,గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు కాగితాలకే అంకితం చేశారన్నారు.