కరోనా వల్ల ఆర్థిక సంక్షోభంతో పాటు క్రీడారంగం కూడా తీవ్రంగా నష్టపోయిందని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. లాక్డౌన్ తర్వాత యోగా సెంటర్లు, జిమ్‌లు ఆగస్టు 5 నుంచి ప్రారంభిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పలువురు క్రీడాకారులు సమావేశమయ్యారు. టెన్నిస్ క్రీడాకారిని సానియా మీర్జా, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్, బ్యాడ్మింటన్ ప్లేయర్లు సిక్కి రెడ్డి, సాయి ప్రణీత్, సుమిత్ రెడ్డి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎండీ శ్రీనివాస్ రాజు, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జయేష్ రంజన్, చాముండేశ్వరినాథ్ హాజరయ్యారు.
రాష్ట్రంలో కొత్త క్రీడా పాలసీపై.. ప్రభుత్వం సబ్ కమిటీను వేసిందని అన్నారు. క్రీడా పాలసీపై తమ సలహాలు, సూచనలు ఇవ్వడానికి సీనియర్ ప్లేయర్లు ముందుకు రావడం సంతోషకరమన్నారు. తక్కువ మందితోనే వ్యాయామశాలలు నడపాలని మంత్రి వెల్లడించారు. సామాజిక దూరం పాటిస్తూ ఆగస్టు 5 నుంచి స్టేడియాల్లో క్రీడలు ప్రాక్టీస్ చేయవచ్చని పేర్కొన్నారు. టోర్నమెంట్ల నిర్వహణకు మాత్రం అనుమతి లేదని వివరించారు.