రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కండ్ల ముందు కనిపిస్తున్నా, కాంగ్రెస్ నేతలు కండ్లు ఉండి కూడా చూడలేని కబోదులుగా మారారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఆదివారం జరిగిన సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ సమావేశంలో మాట్లాడారు. ఇండ్లు లేని పేద ప్రజల కోసం నగరంలో ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించినదని, బీజేపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వద్దనున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మీకు కనిపిస్తలేవా? అని ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
అలాగే, బన్సీలాల్ పేట డివిజన్ పొట్టి శ్రీరాములు నగర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయంలో రూ.10 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన పవర్ బోర్ వెల్ ను మంత్రి ప్రారంభించారు. కాలనీ వాసులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి కోసం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పవర్ బోర్ వెల్, ట్యాంక్ ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. బోర్ వెల్ లో నీటి సమస్య పరిష్కారం అయినట్లేనని అన్నారు. కాలనీ ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.