కరోనా గాల్లో 8 మీటర్లు ప్రయాణిస్తుంది, 4 గంటలు బ్రతికి ఉంటుంది.. !

-

అత్యంత వేగంగా విస్తరిస్తున్నా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అలాంటి వైరస్‌ గురించి.. పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా.. ఈ వైరస్‌ గాల్లో కలిసి వేరే వాళ్లకి సోకే అవకాశం ఉంది. అయితే ఇదివరకు ఇది గాల్లో ఒక మీటర్‌ మాత్రమే ప్రయాణించగలదని అంతా భావించారు. ఈ మేరకు మీటర్‌ మేర సామాజిక దూరం పాటిస్తే కరోనాను కట్టడి చేయవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు జారీ చేసింది. అయితే తాజా పరిశోధనలు మాత్రం ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సూచనలు ఏ మేరకు కరోనా కట్టడికి ఉపయోగపడతాయనే సందేహాలు లేవనెత్తుతున్నాయి.

మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ జరిపిన పరిశోధనల్లో కరోనా వైరస్‌ గాలిలో నాలుగు గంటల పాటు జీవించి ఉంటుందని తేలింది. దగ్గినప్పుడు, తమ్మినప్పుడు. నోరు, ముక్కు నుంచి బయటకు వచ్చే తుంపరలను కలుపుకుని ఈ వైరస్‌ 23 నుంచి 27 అడుగుల దూరం(7-8 మీటర్లు) ప్రయాణిస్తుందని ఆ పరిశోధనల్లో వెల్లడైంది. జర్నల్‌ ఆఫ​ ది అమెరికన్‌ మెడికల్‌ అసోషియేషన్‌ తాజా సంచికలో మసాచుసెట్స్‌ శాస్త్రవేత్తల పరిశోధనలకు సంబంధించిన వివరాలను ప్రచురించారు. 1930లో జరిపిన పరిశోధనలకు అనుగుణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక మీటరు సామాజిక దూరం ప్రతిపాదించిందని.. కానీ ఇప్పుడు వైరస్‌లు బలపడటంతో ఆ దూరం సరిపోదని పరిశోధనల్లో పాల్గొన్న అసోసియేట్‌ ప్రొఫెసర్‌ లిడియా బౌరౌబా తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news